Tirumala Laddu New Rules: తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్‌న్యూస్. ఇక నుంచి లడ్డూ జారీ విధానంలో మార్పులు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. ఇక నుంచి ఆధార్ కార్డు ఉంటేనే లడ్డూలు జారీ చేయనుంది. ఒక భక్తుడికి ఒక లడ్డూ మాత్రమే ఇచ్చేలా నిబంధనలు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు దర్శన టికెట్ చూపిస్తే ఒక లడ్డూ ఇస్తారు. అదనపు లడ్డూ కావాలంటే ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది. టీటీడీ కొత్త నిబంధనలపై భక్తుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
కొత్త ప్రభుత్వంలో తిరుమల కొండపై భక్తులకు మరిన్ని సౌకర్యాలు ఉంటాయనుకుంటే.. టీటీడీ అధికారుల తీరుతో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటివరకు టీటీడీ తీసుకున్న నిర్ణయాలపై ఎలాంటి అభ్యంతరాలు రాకపోగా.. భక్తులు కూడా మెచ్చుకున్నారు. అయితే తాజాగా లడ్డూల విషయంలో మాత్రం భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒక భక్తుడికి ఒక లడ్డూ మాత్రమే ఇస్తామని రూల్స్ మార్చడం భక్తుల ఆగ్రహానికి కారణమైంది. దర్శన టోకెన్‌కు ఒక లడ్డూ, ఆధార్ కార్డు చూపిస్తే మరో లడ్డూ ఇస్తామని అధికారులు చెబుతున్నారు.
కొత్త నిబంధనలు నేటి (గురువారం) నుంచే అమలు చేస్తున్నట్లు చెప్పారు. దీంతో టీటీడీ అధికారులపై భక్తులు మండిపడుతున్నారు.
స్వామి వారి ప్రసాదం అందరికీ అందేలా చూడాలి కానీ.. ఇలా ఆంక్షలు విధించడం సరికాదంటున్నారు. వెంటనే టీటీడీ రూల్స్ మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే బ్రహ్మోత్సవాల సమయంలో లడ్డూల నిల్వ కోసమే నిబంధనలు మార్చాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు.
లడ్డూల నాణ్యత మరింత పెంచేందుకు నెయ్యి టెండర్లను టీటీడీ మార్చిన విషయం తెలిసిందే. ప్రొడక్షన్ తగ్గనుండడంతో భక్తులకు లడ్డూలను తగ్గించినట్లు తెలుస్తోంది. భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో టీటీడీ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.