Flight Emergency Exit Door: విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరవబోయాడు

Passenger Tried To Open Flight Emergency Exit Door Mid-air: అగర్తల : విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణీకుడు విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌ ఓపెన్ చేయడానికి ప్రయత్నించిన ఘటన గురువారం అస్సాంలో చోటుచేసుకుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 22, 2023, 04:56 AM IST
Flight Emergency Exit Door: విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరవబోయాడు

Passenger Tried To Open Flight Emergency Exit Door Mid-air: అగర్తల : విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణీకుడు విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌ ఓపెన్ చేయడానికి ప్రయత్నించిన ఘటన గురువారం అస్సాంలో చోటుచేసుకుంది. గౌహతి నుండి అగర్తలాకు బయలుదేరిన ఇండిగో 6E-457 విమానంలో మొత్తం 180 మంది ప్రయాణిస్తున్నారు. విమానంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ పక్క సీటులోనే కూర్చున్న ఓ యువకుడు విమానం టేకాఫ్ అయిన అనంతరం విమానం గాల్లో ఉండగానే ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరవబోయాడు. 

అతడికి పక్క సీటులో కూర్చున్న మరో ప్రయాణికుడు అది గమనించి అతడిని నిలువరించేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. తోటి ప్రయాణికులు చెబుతున్నా వినిపించుకోకుండా అతడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరవడానికి ప్రయత్నించాడు. దీంతో అతడి వైఖరితో విమానం ప్రమాదంలో పడే అవకాశం ఉందని గమనించిన తోటి ప్రయాణికులే అతడిని గట్టిగా పట్టుకుని విమానంలో ఉన్న ఇండిగో సిబ్బందికి సమాచారం అందించారు.

ప్రయాణికుల అరుపులతో అక్కడికి చేరుకున్న ఫ్లైట్ అటెండెంట్స్ వచ్చి చెబుతున్నప్పటికీ అతడు తన ప్రయత్నాలు మాత్రం ఆపలేదు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది అంతా కలిసి అతడిని నిలువరించి చేతులు వెనక్కి కట్టేసి సీటులో కూర్చోబెట్టారు. ఈ ఘటన విమానంలోని ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేసింది. విమానం అగర్తలాలో ల్యాండ్ అయ్యే వరకు ఆ యువకుడు ఎప్పుడు, ఎలాంటి దుశ్చర్యకు పాల్పడుతాడో అనే భయంతో హడలిపోయాం అని విమానంలో తోటి ప్రయాణికులు తెలిపారు. 

ఇండిగో విమానం అగర్తలా విమానాశ్రయంలో ల్యాండ్ అయిన వెంటనే యువకుడిని విమానం సిబ్బంది అక్కడి పోలీసులు, భద్రతా సిబ్బందికి అప్పగించారు. విమానంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన యువకుడిని అస్సాంకే చెందిన బిస్వజిత్ దేవ్ నాథ్‌గా గుర్తించారు. 

ఇండిగో విమానం సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు బిస్వజిత్ దేవ్ నాథ్‌ని అరెస్ట్ చేసిన అగర్తలా ఎయిర్ పోర్ట్ పోలీసులు.. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో అతడు మత్తు మాత్రలు తీసుకున్నట్టు అగర్తలా పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ మత్తులోనే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

వరుసగా ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. అంతకంటే ముందురోజే చెన్నైకి వెళ్లే ఇండిగో విమానంలో ఒక ప్రయాణీకుడు విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే.  అతడిని అదుపులోకి తీసుకున్న చెన్నై పోలీసులు.. అతడిని మణికందన్‌గా గుర్తించారు. ఆ తరువాత మరుసటి రోజే మళ్లీ ఈ ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా విమానంలో ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు కేప్టేన్ ఆదేశాలకు అనుగుణంగా మాత్రమే విమానంలోని సిబ్బంది ప్రయాణికులకు లైఫ్ జాకెట్స్, పారాషూట్స్ అందించిన తరువాతే ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌ని తెరుస్తారు. చాలా చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే అలాంటి ఘటనలు చోటుచేసుకుంటాయి.

Trending News