5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్‌లో ఓపెనర్ లోకేశ్ రాహుల్ రెచ్చిపోయాడు. వరుసగా వికెట్లు పోగొట్టుకుని కష్టాల్లో పడిన భారత జట్టుని గట్టుకు చేర్చేందుకు తన వంతు కృషి చేస్తున్న రాహుల్.. 118 బంతుల్లో 101 పరుగులు (4X16, 6X1) చేసి తన టెస్ట్ కెరీర్లో 5వ సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఈ సెంచరీతో కేఎల్ రాహుల్ ఓ రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్ గడ్డపై 4వ ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన భారత ఓపెనింగ్ బ్యాట్స్మెన్ల జాబితాలో కేఎల్ రాహుల్ చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో లెజండరీ బ్యాట్స్‌మేన్ సునీల్ గవాస్కర్ 221 పరుగులతో అందరికన్నా ముందున్నాడు. 1979లో ఇదే ఓవల్ గడ్డపై సునీల్ గవాస్కర్ ఈ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత 2వ స్థానంలో కేఎల్ రాహుల్ ఉండగా 3వ స్థానంలో చేతన్ చౌహన్ ఉన్నారు. 1979లో ఇదే స్టేడియంలో చేతన్ చౌహన్ 80 పరుగులు చేసి ఈ రికార్డు కైవసం చేసుకున్నాడు.
అంతకన్నా ముందుగా రెండో ఇన్నింగ్స్‌లో 423 పరుగులు చేసిన ఇంగ్లండ్ జట్టు భారత్‌కు 464 పరుగుల విజయలక్ష్యాన్ని విధించింది. ఈ లక్ష్య చేధన క్రమంలో భారత ఆటగాళ్లు శిఖర్ ధవన్(1), పుజారా(0), కోహ్లీ(0), హనుమ విహారి(0) అత్యల్ప స్కోర్‌కే పెవిలియన్ బాటపట్టారు. 54.5 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. క్రీజ్‌లో రాహుల్(131), రిషబ్ పంత్(48) ఉన్నారు. వీళ్లిద్దరి భాగస్వామ్యంలో 100 పరుగులు పూర్తయ్యాయి.