చండీఘడ్: ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా రేపు ఆదివారం 4వ వన్డే మ్యాచ్ ఆడేందుకుగాను భారత్, ఆస్ట్రేలియా జట్లు నేడు చండీఘడ్‌కు చేరుకున్నాయి. మొహలిలోని ఇంటర్నేషనల్ స్టేడియంలో 4వ వన్డే జరగనుంది. ఇప్పటివరకు పూర్తయిన మూడు వన్డేలలో టీమిండియా తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా మూడో వన్డేలో ఆసిస్ జట్టు విజయం సొంతం చేసుకుంది. దీంతో ఆసిస్‌పై భారత్ 2-1 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది.
4వ వన్డేలో భారత్ గెలిస్తే, సిరీస్‌పై టీమిండియా పూర్తిగా పైచేయి సాధించినట్టవుతుంది. అలా కాకుండా ఒకవేళ ఆసిస్ గెలిస్తే, ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండు జట్లు సమానం అవుతాయి. అదే కానీ జరిగితే, ఇక ఫైనల్ మ్యాచ్ మరింత రసవత్తరం కానుంది. అందుకే ఒకవిధంగా మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేయనున్న 4వ వన్డేపైనే ప్రస్తుతం అందరి దృష్టి కేంద్రీకృతమై వుంది.