వన్డే క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తను ఆడుతున్న 200వ వన్డేలో సెంచరీ నమోదు చేసి ఆ ఘనత సాధించిన రెండవ క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ దక్షిణాఫ్రికాకి చెందిన ఏబీ డివీలర్స్.
న్యూజిలాండ్‌తో వాంఖడే స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో తన కెరీర్‌లోనే 31వ సెంచరీ చేసిన కోహ్లీ మరో రికార్డు కూడా చేజెక్కించుకున్నాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండవ క్రికెటర్‌గా, సచిన్ టెండుల్కర్ తర్వాతి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
సచిన్ వన్డేలలో 49 సెంచరీలు చేశాడు. అలాగే కోహ్లీ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కొనసాగుతున్నాడు. 111 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ కొట్టి ఈ అరుదైన రికార్డును నమోదు చేశాడు కోహ్లీ. అలాగే వాంఖడే స్టేడియంలో సెంచరీ చేసిన మూడవ క్రికెటర్‌గా కూడా రికార్డు క్రియేట్ చేశాడు. కోహ్లీ కంటే ముందు సచిన్, అజారుద్దీన్ ఆ స్టేడియంలో సెంచరీలు చేశారు.