IPL Eliminator 1 RR vs RCB: బెంగళూరు దురదృష్టం మళ్లీ చెదిరిన ఐపీఎల్‌ ట్రోఫీ కల.. రాజస్థాన్‌ విజయం

IPL 2024  Eliminator 1 Rajasthan Royals Won By 4 Wickets Against Royal Challengers Bengaluru: ఐపీఎల్‌ ట్రోఫీ కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మరోసారి నిరాశ ఎదురైంది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌ విజయం సాధించి ముందడుగు వేసింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 22, 2024, 11:53 PM IST
IPL Eliminator 1 RR vs RCB: బెంగళూరు దురదృష్టం మళ్లీ చెదిరిన ఐపీఎల్‌ ట్రోఫీ కల.. రాజస్థాన్‌ విజయం

Eliminator 1  RR vs RCB Live: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ట్రోఫీ కోసం ప్రయత్నిస్తున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు నిరాశ తప్పలేదు. కప్‌ నమ్‌ దే అనే కల కలగానే మారింది. ప్లేఆఫ్స్‌ అవకాశాలు కోల్పోయిన వేళ అద్భుతంగా పుంజుకుని వరుస విజయాలతో దూసుకొచ్చిన బెంగళూరు ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఓటమిపాలైంది. దీంతో ట్రోఫీ అందుకోకుండానే మరో సీజన్‌ను ముగించింది. కీలకమైన మ్యాచ్‌లో బెంగళూరుపై రాజస్థాన్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో క్వాలిఫయర్‌ 2లో సన్‌రైజర్స్‌ తలపడేందుకు సిద్ధమైంది. ఓటమితో ఐపీఎల్‌ సీజన్‌ను ముగించింది.

Also Read: IPL Eliminator 1 RR vs RCB: కోహ్లీ సహా సత్తా చాటలేకపోయిన బ్యాటర్లు.. బెంగళూరు మోస్తరు స్కోర్‌ను రాజస్థాన్‌ ఛేదిస్తుందా?

 

తమ బౌలర్లు పట్టుదలతో రాయల్‌ చాలంజర్స్‌ బెంగళూరు విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని కొంత కష్టంగానే రాజస్థాన్‌ రాయల్స్‌ ఛేదించింది. 6 వికెట్లు కోల్పోయి ఒక ఓవర్‌ మిగిలుండగానే 174 పరుగులు చేసి రాజస్థాన్‌ 'రాజసం'గా విజయం సాధించింది. యువ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌ బ్యాట్‌తో సత్తా చాటాడు. 30 బంతుల్లో 45 పరుగులు సాధించి చక్కటి ఓపెనింగ్‌ ఇచ్చాడు. టామ్‌ కోహ్లెర్‌ కడ్మోర్‌ 20, కెప్టెన్‌ సంజూ శామ్‌సన్‌ 17 పరుగులకు పరిమితమయ్యారు. విజయంపై ఆశలు సన్నగిల్లుతున్న సమయంలో రియాన్‌ గొప్ప ప్రదర్శన చేశాడు. 26 బంతుల్లో 36 పరుగులు చేశాడు. ధ్రువ్‌ జురేల్‌ 8, షిమ్రాన్‌ హెట్‌మెయిర్‌ 26 విలువైన పరుగులు ఇచ్చాడు. రవూమన్‌ పారెల్‌ 16 పరుగులు చేయగా.. సిక్స్‌తో జట్టుకు విజయం అందించాడు.

బ్యాటర్లు ఇచ్చిన స్కోర్‌ను రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కాపాడలేకపోయారు. ఆరంభం బాగానే ఉన్నా ఆఖరి ఓవర్‌కు వచ్చేవరకు చేతులెత్తేశారు. మహ్మద్‌ సిరాజ్‌ 2 వికెట్లు తీసినా జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. లాకీ ఫర్గూసన్‌, కర్ణ్‌ శర్మ, కామెరూన్‌ గ్రీన్‌ ఒక్కొక్క తీశారు. బౌలింగ్‌ వైఫల్యంతో బెంగళూరు పరాజయంతో ఐపీఎల్‌ నుంచి నిష్క్రమించింది.

Also Read: IPL Qualifier 1 KKR vs SRH: ఫైనల్‌లోకి కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌.. సన్‌రైజర్స్‌ ఘోర వైఫల్యం

అంతకుముందు మొదటి ఇన్నింగ్స్ లో బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. భారీగా పరుగులు వస్తాయనుకుంటే మోస్తరు స్కోరే లభించింది. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ సహా ఏ బ్యాటర్‌ కూడా భారీ ఇన్నింగ్స్‌ ఆడలేకపోయారు. 24 బంతుల్లో కోహ్లీ 33 పరుగులు చేసి ఔటయ్యాడు. అంతకుముందే కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ 17 పరుగులు మాత్రమే చేశాడు. కామెరూన్‌ గ్రీన్‌ 27 పరుగులు చేయగా.. రాజత్‌ పతిదర్‌ 34 స్కోర్‌ నమోదు చేశాడు. బ్యాటర్లందరిలో రజత్‌ చేసిన స్కోర్‌ అత్యధికం కావడం గమనార్హం. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ గోల్డెన్‌ డకౌట్‌ కావడం బెంగళూరు అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. అనంతరం మహిపాల్‌ లమ్రోర్‌ బ్యాట్‌తో విలువైన పరుగులు రాబట్టాడు. 17 బంతుల్లో 32 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అనంతరం దినేశ్‌ కార్తీక్‌ 11, స్వప్నిల్‌ సింగ్‌ 9, కర్ణ్‌ శర్మ 5 చొప్పున పరుగులు చేసి కొంత స్కోర్‌ బోర్డును పెంచారు.

రాజస్థాన్‌ బౌలర్లు పొదుపుగా బంతులు వేస్తూ బెంగళూరు స్కోర్ బోర్డుకు కళ్లెం వేశారు. పవర్‌ ప్లే నుంచి ఆఖరి బంతి వరకు చక్కగా బౌలింగ్‌ వేసి ఆర్‌సీబీని నామమాత్రపు స్కోర్‌కు పరిమితం చేశారు. ఆవేశ్‌ ఖాన్‌ రెచ్చిపోయాడు. 44 పరుగులు ఇచ్చినా 3 వికెట్లు తీసి సత్తా చాటాడు. సీనియర్‌ బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక పదును కోల్పోయిన యుజర్వేంద్ర చాహల్‌ కీలకమైన విరాట్‌ కోహ్లీ వికెట్‌ తీయడం గమనార్హం. బ్యాటింగ్‌లో కుదురుకున్న కోహ్లీని చాహల్‌ వెనక్కి పంపించడం మ్యాచ్‌లో హైలెట్‌. ట్రెంట్‌ బౌల్ట్‌, సందీప్‌ శర్మ, చెరొక వికెట్‌ తీశారు.

కోహ్లీ, డీకేకు తీవ్ర నిరాశ
ఐపీఎల్‌లో ఆరు వరుస విజయాలతో దూకుడుతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన రాయల్‌ చాలెంజర్స్‌ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో తడబడింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రెండింటిలోనూ విఫలమై ఓటమి వైపు నిలిచింది. ఈ ఓటమి బెంగళూరు అభిమానులనే కాదు ఆ జట్టు ఆటగాళ్లకు కూడా తీవ్ర నిరాశ మిగిల్చింది. ముఖ్యంగా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీకి మాత్రం జీర్ణించుకోలేని విషయం. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న కోహ్లీ కల ఐపీఎల్‌ ట్రోఫీ కల ఈ ఏడాది కూడా సాకారం కాలేదు. ఈ సీజన్‌ తన చివరిదని ముందే ప్రకటించిన దినేశ్‌ కార్తీక్‌ ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌కు వీడ్కోలు పలికాడు. ట్రోఫీతో గొప్ప ముగింపు లభిస్తుందనుకుంటే ఎలిమినేటర్‌తో నిష్క్రమించడంతో దినేశ్ కార్తీక్‌ నిరాడంబరంగా లీగ్‌ నుంచి వైదొలిగాడు. రిటైర్మెంట్‌ ప్రకటించిన దినేశ్‌ కార్తీక్‌కు జట్టు ఆటగాళ్లు వీడ్కోలు పలికారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News