ప్రస్తుతం బిసిసిఐ అక్టోబరు 2017 నుండి సెప్టెంబరు 2018 నెల వరకు మహేంద్ర సింగ్ ధోనిని గ్రేడ్ - ఏ క్యాటగరీ ఆటగాడిగా పరిగణిస్తూ.. రూ.5 కోట్లను చెల్లించింది. అయితే కొత్త వార్షిక కాంట్రాక్టు ఒప్పందాల మేరకు కొత్తగా ఏ ప్లస్ క్యాటగరీని కూడా బోర్డు తీసుకొని వస్తోంది. ఈ కాంట్రాక్టు మేరకు సెప్టెంబరు 2018 వరకు తాము తీసుకోబోయే క్రీడాకారులకు కనీసం రూ.7 కోట్ల రూపాయలను చెల్లించాలని నిర్ణయించుకుంది.
అయితే ముందుగానే ధోనిని గ్రేడ్ - ఏలో చేర్చడం వల్ల ఆయనకి మళ్లీ కొత్తగా ఏ ప్లస్ క్యాటగరీలో చేరే వీలు లేదు. ఈ కొత్త క్యాటగరీలో బూమ్రా, కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్ లాంటి ఆటగాళ్ళకు చోటు దక్కింది. దీంతో టెక్నికల్‌గా వీరి కంటే ధోని తక్కువ జీతం తీసుకోవాల్సి వస్తోంది. ఈ ఆటగాళ్ళలో పలువురికి ధీనితో పోల్చుకుంటే తక్కువ అనుభవం ఉన్నా.. వారు మూడు ఫార్మాట్లలో ఆడడం వల్ల వారికి ఆ ధర పలికిందని అంటున్నారు బిసిసిఐ అధికారులు.
గతంలో రోహిత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బూమ్రా లాంటి ఆటగాళ్లు గ్రేడ్ బీ క్యాటగరీలో ఉంటూ.. ధోని కంటే తక్కువ మొత్తం అందుకున్నవారే. అయితే వారిని డైరెక్ట్‌గా ఏ ప్లస్ క్యాటగరీలోకి తీసుకోవడంసై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఆయా క్యాటగరీల్లోకి క్రీడాకారులను తీసుకోవడం అనేది పూర్తిగా వారి ప్రతిభ పైనే ఆధారపడి ఉంటుందని.. ఇందులో ఎలాంటి పైరవీలకు చోటు ఉండదని అంటున్నారు బిసిసిఐ అధికారులు. అయితే ఒక కెప్టెన్ స్థాయిలో భారత్‌కు 2007లో ట్వంటీ 20 ప్రపంచ కప్, 2011లో వన్డే ప్రపంచ కప్‌తో పాటు 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన లెజెండరీ ఆటగాడైన ధోనిని ఏ ప్లస్ క్యాటగరీలోకి చేర్చకపోవడంపై పలువురు అభిమానులు విమర్శలు కురిపిస్తున్నారు.