మందుబాబులకు..ఇక "ఆధార్" దెబ్బ

  

Last Updated : Nov 5, 2017, 01:41 PM IST
మందుబాబులకు..ఇక "ఆధార్" దెబ్బ

హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు ఒక వినూత్నమైన పద్ధతికి శ్రీకారం చుట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికే మందుబాబులను కట్టడి చేసేందుకు వారి వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నారు. తర్వాత ఒక ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ సహాయంతో వారి చలానా రికార్డులను భద్రపరుస్తున్నారు.

తద్వారా పదే పదే మందు కొట్టి "డ్రంక్ అండ్ డ్రైవ్" కేసులో దొరికిపోయే మందుబాబులు, అదే మొదటి సారని బుకాయించే అవకాశం ఉండదు. ఎక్కువ మోతాదులో మద్యం సేవించి వాహనం నడుపుతున్నారని అనుమానం వస్తే... పోలీసులు వాహనదారుడి ఆధార్ నెంబరు అడిగి తెలుసుకుంటున్నారు. అలా పొందిన ఆధార్ సంఖ్యను వారి వద్దనున్న మినీలాప్ టాప్‌లోని వెబ్ అప్లికేషన్‌లో ఎంటర్ చేయగానే, వాహనదారుడి గత చరిత్ర అంతా తెరపైకి వస్తుంది.

అసలు ఎన్నిసార్లు ఆ వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికిపోయాడు.. ఎన్నిసార్లు ఫైన్ కట్టాడు.. ఎన్నిసార్లు కౌన్సిలింగ్‌కి హాజరయ్యాడు మొదలైన వివరాలన్నీ బహిర్గతమవుతాయి. ఒకవేళ వాహనదారుడు పదే పదే దొరికితే ఫైన్ రేటు పెరగడమే కాకుండా.. జైలుశిక్షను కూడా అనుభవించాల్సి వస్తుంది.

ఈ కొత్త పద్ధతి ద్వారా మద్యం సేవించి వాహనం నడిపేవారు అలర్ట్ అవుతున్నారు. సొంత వాహనంలో ఇంటికి వెళ్లి పోలీసులతో ఇబ్బంది పడేకన్నా, ఏ ఆటో లేదా క్యాబ్‌లోనో ఇంటికి వెళ్లడం శ్రేయస్కరం అని భావిస్తున్నారు. ఈ కొత్త పద్ధతి వల్ల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉందని పోలీసులు కూడా భావిస్తున్నారు. 

Trending News