హైదరాబాద్: తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్ఠికి తీసుకువెళ్లి వారికి తప్పకుండా న్యాయం జరిగేలా కృషి చేస్తామని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి మహమూద్ అలీ తెలిపారు. అగ్రిగోల్డ్ కేసులో గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఆండాళు రమేష్ బాబు నేడు హోం మంత్రిని కలిసి రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు. హోంమంత్రి స్పందిస్తూ అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ వాటిని కొన్నప్పుడు ఎకరా లక్షల్లో ఉంటే ఈరోజు వాటి ధర కోట్లు పలుకుతోందని అన్నారు. బాధితులందరికి తప్పకుండా డబ్బులు వస్తాయని ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదని బాధితులకు భరోసా ఇచ్చారు.
Read also : రూ. 20 వేలలోపు అగ్రిగోల్డ్ బాధితులకు తీపి కబురు
ఆంధ్రప్రదేశ్‌లో అగ్రిగోల్డ్ బాధితుల కోసం అక్కడి ప్రభుత్వం విడతల వారీగా డబ్బుల పంపిణీ కార్యక్రమం చేపడుతున్న సంగతి తమకు తెలుసని, న్యాయపరమైన అంశాలపై సమీక్ష చేసిన అనంతరం తమ ప్రభుత్వం ద్వారా తెలంగాణలోని బాధితులకు కూడా న్యాయం చేస్తామని హోం మంత్రి హామీ ఇచ్చారు. హోం మంత్రిని కలిసిన వారిలో తెలంగాణ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు సువ్వారి రమేష్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.