Kishan Reddy Vijaya Sankalpa Yatra From Makthal: నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణా నది ఒడ్డు నుంచి బీజేపీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. అక్కడి దత్తాత్రేయ స్వామికి, కృష్ణా నదికి పూజలు చేసిన అనంతరం యాత్రను కిషన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మక్తల్ పట్టణంలో జరిగిన బహిరంగ సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ..మరోసారి బీజేపీని ఆదరించాలని పిలుపునిచ్చారు. 'రానున్న లోక్‌సభ ఎన్నికలు తెలంగాణకు సంబంధించినవి కావు. దేశానికి సంబంధించిన ఎన్నికలు. మన పిల్లలు, మన దేశం.. దేశ భవిష్యత్ కోసం నరేంద్రమోదీని ప్రధానిగా ఎన్నుకోవాలి' అని విజ్ఞప్తి చేశారు.
Also Read: Two Board Exams: విద్యార్థులకు కేంద్రం భారీ షాక్.. ఏడాదిలో రెండు 'బోర్డు పరీక్షలు' రాయాల్సిందే..
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2013లో ఇక్కడి నుంచే పోరుయాత్ర ప్రారంభించినట్లు కిషన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. తెలంగాణలో మార్పు రావడమే లక్ష్యంగా విజయ సంకల్ప యాత్ర చేపట్టినట్లు వివరించారు. మోదీ మూడోసారి ప్రధాని కావాలని ప్రతిఒక్కరూ కోరుకుంటున్నారని తెలిపారు. తొమ్మిదేళ్లు కేసీఆర్ కుటుంబ రాష్ట్రాన్ని దోచుకుంటే.. ఇప్పుడు రాహుల్ గాంధీ తెలంగాణను దోచుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ సంపదతో రాహుల్ గాంధీ పార్లమెంట్ ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీకి ట్యాక్స్ కడుతోందని మండిపడ్డారు.
Also Read: Lok Sabha Elections: సమరానికి సై.. మార్చి 9 తర్వాత ఏ క్షణంలోనైనా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్
కాంగ్రెస్ పార్టీపై ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తొమ్మిదిన్నర సంవత్సరాలుగా నరేంద్ర మోదీ అవినీతి రహిత పాలన అందించారని తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతి, కుంభకోణాలే గుర్తుకు వస్తాయని చెప్పారు. తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అమలుకాని హామీలతో అధికారంలోకి వచ్చిందని వివరించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచి విద్యుత్ బిల్లులు కట్టొద్దన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమీ మాట్లాడడం లేదని మండిపడ్డారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుచేయడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నిలదీశారు. 'రుణమాఫీ, ఎకరానికి రూ.15,000 రైతుబంధు, మహిళలకు రూ.2,500 ఇస్తామని చెప్పారు. మహాలక్ష్మి లేదు.. మహారాజు లేదు. వాళ్లు మాత్రం కుర్చీలో కూర్చున్నారు' అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు కుటుంబ, అవినీతి పార్టీలని, ప్రజలను మోసం చేసే పార్టీలుగా అభివర్ణించారు. ఇదే కార్యక్రమంలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల పాల్గొని కార్యకర్తలకు సందేశం ఇచ్చారు. మోదీని మరోసారి ప్రధాని చేయాలని పిలుపునిచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి