Car Racing in Hyderabad: కార్ల రేసింగ్ ట్రయల్స్ పేరుతో ప్రజలకు ఎంతో నష్టం జరుగుతోంది. నగరం నడిబొడ్డున గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోంది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న అంబులెన్సులు కూడా ఈ ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుపోయ ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంటోంది. ఇలా ప్రజలకు జరుగుతున్న నష్టానికి అంతటికీ బాధ్యత ఎవరిది ? అని తెలంగాణ బీజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రశ్నించారు. నగర వాసులకు ఇబ్బందులు కలిగేలా నగరం నడిబొడ్డున రేసింగ్ నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.
కార్ల రేసింగ్ ట్రయల్స్ కోసం సెక్రటేరియట్ పరిసరాల్లో నడిరోడ్డుపై మద్యాన్ని ఏరులై పారిస్తారా ? కార్ల రేసింగ్ కోసం ఎన్టీఆర్ పార్కును అడ్డంగా చీలుస్తారా ? ఇంతకీ ఈ రేసింగ్ నిర్వహణ ప్రభుత్వానిదా ? లేక ప్రైవేటు వ్యక్తులదా ? ఒకవేళ ప్రైవేటుదైతే రోడ్లుసహా సౌకర్యాలన్నీ ప్రభుత్వమే ఎందుకు కల్పిస్తొంది ? అలా కాకుండా ఒకవేళ ఈకార్ల రేసింగ్ నిర్వహణ ప్రైవేటుదైతే... టిక్కెట్ పేరుతో వసూలు చేస్తున్న పెద్ద మొత్తం ఎవరి ఖాతాలోకి వెళుతుందో జవాబు చెప్పాలంటూ బండి సంజయ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. తన ప్రశ్నలకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కార్ల రేసింగ్ నిర్వహణ కోసం నగరం నడిబొడ్డున సెక్రటేరియట్, ఐమాక్స్, నెక్లెస్ రోడ్డు పరిసరాలన్నీ పోలీసులు దిగ్బంధించడం ఎంతవరకు సమంజసం ? రోడ్లన్నీ బ్లాక్ చేయడంవల్ల కలిగే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని అడిగారు. ఒకవేళ ఈ కార్ల రేస్ ట్రయిల్స్ ప్రైవేట్ ప్రోగ్రాం అయితే ఆ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వమే ప్రజాధనం వృథా చేసి మరీ రోడ్లు వేసి అన్ని సౌకర్యాలు ఎందుకు కల్పిస్తుందో వివరణ ఇవ్వాలన్నారు.
The first ever Street Circuit #CarRacing of the country begins in Hyderabad.
This is the first round of Indian Racing League (IRL) 2022 organised ahead of Formula E race to be held in the city on February 11 next year.pic.twitter.com/ifAIVpTufC
— All India Radio News (@airnewsalerts) November 19, 2022
ఒకవేళ ఇది ప్రభుత్వం తరపున చేస్తోన్న కార్యక్రమం అయితే.. ఒక్కో టిక్కెట్‌ను రూ.7 వేల దాకా బుక్ మై షోలో విక్రయించడంతో పాటు టిక్కెట్ కొనుగోలుదారులకు నడిరోడ్డుపై మద్యం సరఫరా చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందని బండి సంజయ్ ప్రభుత్వాన్ని ఏకిపారేశారు. కార్ల రేసింగ్ ట్రయల్స్ రూట్ మ్యాప్‌ను చూస్తుంటే... ఎన్టీఆర్ పార్క్ భూముల మధ్యలో నుండి రోడ్డు వేసినట్లు కన్పిస్తోంది. ఎన్టీఆర్ పార్కును చీలుస్తూ రోడ్డు వేయాల్సినంత అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చింది ? అసలు ఎంత భూమి తీసుకున్నరు? ఎందుకు తీసుకున్నరు ? ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు వారు వ్యవహరించడానికి ఇదేమైనా కేసీఆర్ తాత జాగీరనుకుంటున్నారా అని బండి సంజయ్ మండిపడ్డారు. నగర పౌరులకు ఇబ్బందులు లేకుండా నగర శివార్లలో ఎక్కడైనా ఈ కార్ల రేసింగ్ పెట్టుకుంటే బీజేపికి అభ్యంతరం లేదని.. కానీ ఇలా ప్రజలను ఇబ్బందిపెట్టేలా నగరం నడిబొడ్డున రోడ్డుపై విన్యాసాలు చేస్తాం అంటేనే ఊరుకునే ప్రసక్తే లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.