ఇంటర్ మార్కుల అవకతవకలపై కేసీఆర్ నష్ట నివారణ చర్యలు

ఇంటర్ మార్కుల అవకతవకలపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు

Last Updated : Apr 24, 2019, 07:34 PM IST
ఇంటర్ మార్కుల అవకతవకలపై కేసీఆర్ నష్ట నివారణ చర్యలు

ఇంటర్ మార్కుల అవకతవకలపై సీఎం కేసీఆర్ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ప్రగతిభవనలో ఇంటర్‌బోర్డు వ్యవహారంపై సమీక్ష నిర్వహించిన కేసీఆర్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్యార్ధుల ఆందోళనను దష్టిలో పెట్టుకొని ఫెయిలైన విద్యార్థులకు ఉచితంగా రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌ చేయాలని ఇంటర్‌బోర్డును ఆదేశించారు. ఒక వేళ  పాసైన విద్యార్థులు రీవెరిఫికేషన్‌ కోరినా చేయాలని.. ఈ అంశంలో గత విధానమే పాటించాలని సీఎం సూచించారు. జాప్యం లేకుండా రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌ ప్రక్రియలను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
సప్లిమెంటరీ పరీక్షలపై కేసీఆర్ ఆరా..
ఇదే సందర్భంలో సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై కేసీఆర్ ఆరా తీశారు. దీని ఏర్పాట్లు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనీట్, జేఈఈ లాంటి దేశవ్యాప్త ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు హాజరు కావాల్సి ఉన్నందున వీలైనంత త్వరగా అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించాలని ఆదేశించారు. విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోకుండా అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. 
బోర్డు కార్యదర్శిపై వేటు...
ఇంటర్‌ ఫలితాల గందరగోళం విషయంలో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్‌ ను రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌, సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ బాధ్యతల నుంచి  తప్పించి విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు . ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా సరైన వ్యూహాల్ని ఖరారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు

Trending News