Double bed room flats: కేసీఆర్ పూర్వీకుల స్వస్థలం ఇక్కేడేనని.. అందుకే కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీకి సిద్ధమయ్యారని కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఓవైపు చెబుతుండగా.. మరోవైపు తాజాగా కురిసిన భారీ వర్షాలకు అదే నియోజకవర్గం పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వాన నాటికి మోకాళ్ల లోతు నీళ్లలో చిక్కుకోవడం స్థానికంగా చర్చనియాంశమైంది. ఇదే విషయమై మాజీ మంత్రి షబ్బీర్ అలీ స్పందిస్తూ.. " 1500 కోట్లతో ప్రగతి భవన్, 15 వేల కోట్లతో సచివాలయం కట్టుకుని ప్రజలను మాత్రం నీటిలో ఉండేలా ఇండ్లు కట్టిస్తావా కేసీఆర్ " అని ప్రశ్నించారు. నాణ్యత లేని ఇండ్లు కట్టి కాంట్రాక్టర్లు జేబులు నింపుకున్నారన్నారు. గతంలో టేక్రియాల్ లో నాణ్యత లేని ఇండ్లను ప్రత్యక్షంగా చూపించానని, ఇప్పుడు నీటిలో మునిగిన రామేశ్వర్ పల్లి డబులు ఇండ్లు చూస్తున్నామన్నారు.
కల్వకుంట్ల కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని, జైలుకు పోయే రోజులు దగ్గర పడ్డాయని షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం రామేశ్వర్ పల్లి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు నీటిలో మునిగిపోయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను షబ్బీర్ అలీ పరిశీలించారు. మోకాలి లోతు నీటిలో నడుచుకుంటూ వెళ్లి ఇళ్లలో ఉంటున్న వారితో మాట్లాడి వారి సమస్యలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
వాన నీటిలో మునిగిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలన అనంతరం షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలంటే కేసీఆర్ కు చిన్నచూపు ఎందుకు అని ప్రశ్నించారు. కేసీఆర్ కు ఓటేస్తామని చేసిన ఏకగ్రీవ తీర్మానాలపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశామని, రేపటి నుంచి ఆర్టీఏ ద్వారా తీర్మాన కాపీలను తీసుకోబోతున్నామన్నారు. పంచాయతీ కార్యదర్శి ఇవ్వకపోతే తిర్మణాలు వట్టివేనని తేలిపోతుందన్నారు. ఏకగ్రీవాలపై తదుపరి హైకోర్టుకు వెళతామని తెలిపారు. కేసీఆర్ కన్ను కామారెడ్డి భూములపై పడిందని, అందుకే తనను ఓడించే వంకతో వస్తున్నారన్నారు.
రింగ్ రోడ్లు, అభివృద్ధి పేరుతో తెలంగాణలో పేదల భూములన్నీ లాక్కుంటున్న కేసీఆర్.. చివరకు ఆ భూములను కేసీఆర్ బంధువుల పేరిట మార్పిడి చేసుకుంటున్నారని షబ్బీర్ అలీ మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఉద్యమాల గడ్డ కామారెడ్డి అని, ఇక్కడ కేసీఆర్ ఓటమి తప్పదన్నారు. ఎప్పుడైతే సీఎం కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నట్టు ప్రకటించారో.. అప్పటి నుండే కేసీఆర్ పై షబ్బీర్ అలీ ఇంకొంత దూకుడు పెంచారు.
ఇదిలావుంటే, ఇదే కామారెడ్డి నియోజకవర్గం నుండి బీజేపీ తరపున సీటు ఆశిస్తోన్న కాటిపల్లి వెంకట రమణా రెడ్డి సైతం కేసీఆర్ పై ఇవే ఆరోపణలు చేస్తున్నారు. కేసిఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయడం వెనుక 25 వేల ఎకరాల అసైన్డ్ భూములను కాజేసే కుట్ర దాగి ఉందని... గజ్వేల్ లో భూములు మింగింది చాలదన్నట్టుగా ఇప్పుడు కామారెడ్డిలో ప్రభుత్వ భూములు, ఆర్టీసీ భూములపై కన్నేశారని కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆరోపిస్తున్నారు.