అర్చకులకు జీతాలొచ్చాయ్..

 ప్రభుత్వ ఉద్యోగులకు ట్రెజరీ ద్వారా ఎలాగైతే జీతాలు అందుతున్నాయో.. అలాగే వచ్చే నెల నుండి నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే వేతనం జమచేస్తామన్నారు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.

Last Updated : Dec 2, 2017, 01:02 PM IST
అర్చకులకు జీతాలొచ్చాయ్..

'దేవాదాయ శాఖలో నూతన శకం ప్రారంభమైంది. డిసెంబర్ ఒకటో తేదీ అర్చకులు గుర్తుపెట్టుకోవలసిన రోజు' అని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. డిసెంబర్ ఒకటో తేదీ (శుక్రవారం) నుండి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే ఆలయ అర్చకులకు, ఉద్యోగులకు వేతన స్కేళ్లు అమలులోకి వచ్చాయి. గత కొంతకాలంగా ఆలయ అర్చకులు, ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి జీతాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వచ్చారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అమలయ్యేట్లు కృషి చేస్తామని ఇదివరకు ప్రకటించిన సంగతి తెలిసిందే..! 

ఇందులో భాగంగా శుక్రవారం రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యాలయంలో మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి అర్చకుల జీతాల చెక్కుపై సంతకం చేసి ఆంధ్రాబ్యాంక్ మేనేజర్‌కు అందజేశారు. మంత్రి మాట్లాడుతూ... దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా సీఎం కేసీఆర్ ఆలయ అర్చకులకు, ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారని అన్నారు. వీరి వేతనాలకు రూ.115 కోట్లు ఖర్చు అవుతుందని.. ఇప్పటికే ప్రభుత్వం రూ.37.50 కోట్లు విడుదల చేసిందని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ట్రెజరీ ద్వారా ఎలాగైతే జీతాలు అందుతున్నాయో అలాగే.. వచ్చే నెల నుండి నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే వేతనం జమ చేస్తామన్నారు.  ప్రభుత్వ సలహాదారు, విశ్రాంత ఐఏఎస్  అధికారి కె.వి.రమణాచారి మాట్లాడుతూ "తెలంగాణ వాసులకు జూన్ 2 ఎలాగో.. అర్చకులకు డిసెంబర్ 1 అలా అని చెప్పవచ్చు" అని అన్నారు.

Trending News