భద్రతా వలయంలో.. భాగ్యనగరం

ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుతో పాటు మెట్రోరైల్ ప్రారంభ వేడుక కూడా ఉండడంతో నగరంలో ప్రతీ చోటా హై అలర్ట్ ప్రకటించారు

Last Updated : Nov 26, 2017, 10:33 AM IST
భద్రతా వలయంలో.. భాగ్యనగరం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హైదరాబాద్‌ని సందర్శిస్తున్న క్రమంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పైగా ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుతో పాటు మెట్రోరైల్ ప్రారంభ వేడుక కూడా ఉండడంతో నగరంలో ప్రతీ చోటా హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా మెట్రో రైల్ ప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోడీ వస్తుండడంతో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ దళాలు కూడా రంగంలోకి దిగాయి. ఫలక్ నామా ప్యాలెస్, గోల్కొండ ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరిస్తున్నారు.

ఇప్పటికే దాదాపు 15 వేల మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు వినికిడి.  నగరంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను కనిపెట్టడానికి కూడా కొన్ని ప్రత్యేక టీమ్‌లు తిరుగుతున్నాయి. జీఈఎస్‌ సదస్సుకు వేదికైన హెచ్‌ఐసీసీ వద్ద భద్రతను సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ శాండిల్యదగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా ఇవాంకా ట్రంప్‌ బస చేయనున్న హోటల్‌ దగ్గర నిఘా వ్యవస్థను పటిష్టం చేయడానికి డీసీపీ స్థాయి అధికారులు ప్రత్యేక టీమ్‌లుగా విడిపోయి భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం

ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకి రతన్ టాటా, ముఖేష్ అంబానీ లాంటి వ్యాపార దిగ్గజాలు కూడా హాజరవుతుండడంతో ప్రత్యేక కూంబింగ్ టీమ్ కూడా ఇప్పటికే హైదరాబాద్‌లో గస్తీ కాస్తోంది.  గోల్కొండ కోటకు వెళ్లే మార్గాల వద్ద తాత్కాలికంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరుగనున్న ఇవాంకా ట్రంప్‌‌తో ప్రత్యేక విందు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ ఏర్పాట్లు పర్యవేక్షించడానికి.. హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో ఒక ప్లానింగ్ టీమ్ కూడా ఏర్పడింది. 

Trending News