హైదరాబాద్ : కేంద్రం అవలంభిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ 'దేశాన్ని రక్షించుకుందాం.. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం' నినాదంతో గాంధీభవన్ నుంచి ట్యాంక్ బండ్‌పైనున్న అంబేద్కర్ విగ్రహం వరకు శనివారం కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన తిరంగ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. అయితే, పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ ర్యాలీ నిర్వహించి తీరుతామని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటించారు. ఒకవేళ పోలీసులు ర్యాలీని అడ్డుకున్నట్టయితే.. పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్‌లోనే ఒక రోజు సత్యాగ్రహ దీక్ష చేపడతామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారమే ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైతే వారిని అడ్డుకోవడానికి పోలీసులు సైతం గాంధీ భవన్ సిద్దంగా ఉన్నారు. గాంధీ భవన్ వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మొహరించిన నేపథ్యంలో గాంధీభవన్ బయట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు గాంధీభవన్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ సహా పలువురు నేతలు సత్యాగ్రహ దీక్షలో కూర్చున్నారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ 135వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నేపథ్యంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ దీక్షలో కూర్చున్నారు.
శనివారం తలపెట్టిన తిరంగ ర్యాలీకి హైదరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించడంపై శుక్రవారం మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ నేతలు.. తెలంగాణ సర్కార్‌పై తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. గుర్రాలు, కర్రలతో చేసిన ఆర్ఎస్ఎస్ ర్యాలీకి అనుమతి ఇచ్చిన పోలీసులు.. తాము శాంతియుతంగా దేశహితం కోసం కోరుతూ చేపట్టనున్న తిరంగ ర్యాలీకి ఎందుకు అనుమతి ఇవ్వరని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో కల్వకుంట్ల పోలీసు సర్వీస్ నడుస్తోందని.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎలా చెబితే పోలీసులు అలా వింటున్నారని ఉత్తమ్ మండిపడ్డారు.