వాహనాల నెంబర్ ప్లేటు అలా వుంటే ఇక కోర్టుకే.. : ట్రాఫిక్ పోలీసులు

వాహనాల హై సెక్యురిటీ నెంబర్ ప్లేట్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కొరడా ఝులిపించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరో కొత్త పాలసీని తీసుకొచ్చారు.

Last Updated : Jan 23, 2019, 01:34 PM IST
వాహనాల నెంబర్ ప్లేటు అలా వుంటే ఇక కోర్టుకే.. : ట్రాఫిక్ పోలీసులు

హైదరాబాద్‌: వాహనాల హై సెక్యురిటీ నెంబర్ ప్లేట్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కొరడా ఝులిపించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరో కొత్త పాలసీని తీసుకొచ్చారు. నిబంధనలను ఉల్లంఘించి వాహనాలు నడిపే వారు ట్రాఫిక్ చలానాల బారి నుంచి తప్పించుకునేందుకు తమ వాహనాల నంబరు ప్లేట్లను వంచేస్తున్నారని గుర్తించిన పోలీసులు.. ఇకపై వారిపై కఠిన వైఖరి అవలంబించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు జరిమానాలతోనే సరిపెట్టిన పోలీసులు నేటి నుంచి వారిపై కేసు నమోదుతో పాటుగా కోర్టులో చార్జ్ షీట్ సమర్పించనున్నారు. అదేకానీ జరిగితే వాహన చోదకులు తప్పనిసరిగా కోర్టులో హాజరుకావాల్సి ఉంటుంది. అక్కడ జరిమానా చెల్లించి తర్వాతే వాహనాన్ని తిరిగి తీసుకోవాల్సి ఉంటుందని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.

ట్రాఫిక్ పోలీసుల కెమెరాలకు చిక్కడానికి వీల్లేకుండా వాహనాల నెంబర్ ప్లేట్లను వంచుతున్న వారి సంఖ్య ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగిపోతుండటాన్ని గుర్తించిన పోలీసులు కొద్దినెలలుగా ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి అలాంటి వారికి జరిమానా విధిస్తున్నారు. అలా ఇప్పటివరకు కేవలం జరిమానాలతోనే సరిపెట్టిన ట్రాఫిక్ పోలీసులు.. ట్రాఫిక్ ఉల్లంఘనులపై మరింత కఠిన వైఖరి అవలంభించేందుకు కొత్తగా చార్జ్ షీట్‌ నమోదు పాలసీని ప్రవేశపెట్టారు.

Trending News