హైదరాబాద్: గత మూడు రోజులుగా నగరం అకాల వర్షాలతో తడిసి ముద్దవతోంది. మంగళవారం నుంచి నగరంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో గురువారం సాయంత్రం సైతం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం శుక్రవారం సైతం హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురవనున్నాయని తెలుస్తోంది. ఉత్తర తెలంగాణలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటమే ఈ అకాల వర్షాలకు కారణమని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. గురువారం బేగంపేటలోని షేక్‌పేటలో అత్యధికంగా 43మిల్లీమీటర్లు, ఆ తర్వాత ఈస్ట్ మారేడ్‌పల్లిలో 37.3 మిమి, మల్కాజిగిరిలో 30.3 మి.మి వర్షపాతం నమోదైనట్టుగా తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ పేర్కొంది. సఫీల్‌గూడ, మల్కాజిగిలో 7 మిమి అత్యల్ప వర్షపాతం నమోదైంది. అనుకోని వర్షపాతం కారణంగా నగరంతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. రానున్న కొద్ది రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఈశాన్యం నుంచి వీచే గాలులు ఆలస్యమైన కారణంగా ఈసారి శీతాకాలం కొంత ఆలస్యమైందని.. ఈ నెల్లోనే ఇక అసలైన శీతాకాలం ప్రవేశించనుందని వాతావారణ శాఖ అధికారులు వెల్లడించారు.