Kcr New Scheme: ఓట్లే లక్ష్యంగా కేసీఆర్ కొత్త స్కీం.. దసరా నుంచి అమలు! గులాబీ పండగేనా..

Kcr New Scheme: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది నవంబర్ లో జరగాల్సి ఉంది. రాష్ట్రంలో మాత్రం ముందస్తు ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.2018 తరహాలోనే ఈసారి కూడా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం సాగుతోంది.

Written by - Srisailam | Last Updated : Sep 2, 2022, 09:12 AM IST
  • తెలంగాణ సర్కార్ కొత్త స్కీం
  • దసరా నుంచి అమలు
  • ఇండ్ల పథకం ఓట్లు రాల్చేనా?
Kcr New Scheme: ఓట్లే లక్ష్యంగా కేసీఆర్ కొత్త స్కీం.. దసరా నుంచి అమలు! గులాబీ పండగేనా..

Kcr New Scheme: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది నవంబర్ లో జరగాల్సి ఉంది. రాష్ట్రంలో మాత్రం ముందస్తు ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.2018 తరహాలోనే ఈసారి కూడా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం సాగుతోంది. నవంబర్, డిసెంబర్ లో అసెంబ్లీ రద్దు చేసి.. వచ్చే మార్చిలో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణ ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన టీఆర్ఎస్ చీఫ్.. ఓట్లే లక్ష్యంగా కొత్త పథకాలకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. 2017లో రైతు బంధు పథకం తీసుకొచ్చారు కేసీఆర్. 2018లో తిరిగి టీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి ఆ పథకమే పనిచేసిందని చెబుతరు. ఈసారి కూడా అలాంటి పథకాన్నే కేసీఆర్ ప్రకటించబోతున్నారని... దసరా నుంచి అమలు చేయబోతున్నారని సమాచారం.

కేసీఆర్ సర్కార్ తీసుకొచ్చిన డబుల్ బెడ్ రూమ్ స్కీమ్ ఆశించినంతగా ముందుకు పడలేదు. ఇప్పటివరకు వేల్లలోనే ఇళ్లను లబ్దిదారులకు అందించారు. అయితే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కాకుండా సొంత భూమి ఉన్న పేదలకు.. అందులో ఇంటిని నిర్మించుకునేందుకు ప్రభుత్వం నుంచి 3 లక్షల రూపాయల సాయం అందిస్తామని గతంలో ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ పథకాన్ని పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. విజయ దశమి నుంచి ఈ స్కీమ్ ను అమలు చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి విధివిధానాలను సీఎం కేసీఆర్‌ ఫైనల్ చేశారని తెలుస్తోంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి దశలో మూడు వేల ఇళ్లకు 3 లక్షల రూపాయల సాయం చేయావని భావించినా... నిధుల కొరతతో వెయ్యికి కుదించారు. నిధుల మంజూరుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.ఇంటి  పునాదులు తీసిన తర్వాత తొలి బిల్లు ఇవ్వాలని నిర్ణయించారని తెలుస్తోంది. పునాదులు దాటి స్లాబ్ లెవల్‌కు వచ్చాకే తొలి బిల్లు ఇవ్వనున్నారు. ముందుగానే ఇవ్వడం వల్ల గతంలో అక్రమాలు జరిగాయని అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.

ఈ పథకంలో లబ్దిదారుల ఎంపిక కీలకం కానుంది. అర్హుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగించే యోచనలో ఉన్నట్టు తెలిసింది. హౌసింగ్ స్కీం గైడ్ లెన్స్ ప్రకారం ఇస్తే టీఆర్ఎస్ కార్యకర్తలు ఇవ్వడం కష్టమనే భావనలో ఉన్నారట గులాబీ లీడర్లు. లబ్ధిదారుల ఎంపిక బాధ్యత కలెక్టర్లకు ఉండేలా అధికారులు ఫైల్ రూపొందించారు. ఇందులో మార్పులు చేసిన కేసీఆర్.. ఎమ్మెల్యేల పర్యవేక్షణలో ఉండేలా సెట్ చేశారట. దీంతో తమ అనుకున్న వారికే స్కీంను అమలు చేసేలా స్కెచ్ వేశారంటున్నారు. బీపీఎల్ కార్డు హోల్డర్లే అర్హులు. డబుల్​బెడ్ రూం ఇండ్ల కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా ఈ పథకంలో అవకాశం ఇవ్వనున్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకొని ఉండి.. ఇండ్లు రాని వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు.  స్కీమ్ లబ్దిదారుల ఎంపికలో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం కోటా కల్పించనున్నారు.

2014లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు. గతంలో ప్రభుత్వం నుంచి గృహం పొందనివారే అర్హులు. గ్రామీణ ప్రాంతాల్లో 75 గజాలు, పట్టణాల్లో 50 గజాల నుంచి 75 గజాల మధ్య స్థలం ఉండాలని అధికారులు మార్గదర్శకాలు రూపొందించారు.  కింద ఒక గది, పైన మరో గది నిర్మించుకోవాలనుకుంటే కనీస స్థలం 35 గజాలు ఉన్నా ఒకే చేయనున్నారు.  ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో  పార్టీ కార్యకర్తలకు  ప్రాధాన్యం ఇస్తామని సీఎం కేసీఆర్ చెబుతూ వస్తున్నారు. ఇళ్ల స్కీమ్ గురించి కొన్ని రోజులుగా టీఆర్ఎస్ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. గులాబీ కార్యకర్తలపై సాయం అందిస్తామని ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావే స్వయంగా ప్రకటించారు. దీంతో ఈ స్కీంలో లబ్జిదారుల ఎంపిక పార్టీ పరంగానే ఉండనుందని తెలుస్తోంది.మరోవైపు లబ్దిదారుల ఎంపికను దసరా నుంచి ఫైన్ చేసినా..  ఇళ్ల నిర్మాణాలు మాత్రం వచ్చే ఏడాదే మొదలవుతాయని అంటున్నారు.

Read Also: హీరోయిన్ల దెబ్బకు ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్న తెలుగు ఫిలిం ఛాంబర్

Read Also: Midterm Elections in Telangana: కర్ణాటక, గుజరాత్ ఎన్నికలతో పాటే మధ్యంతర ఎన్నికలకు కేసీఆర్ ప్లానింగ్ ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News