తెలంగాణ సీఎం కేసీఆర్‌కు చెన్నైలో ఘన స్వాగతం లభించింది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఉన్న కేసీఆర్ ఈ విషయంపై డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ను కలిసి చర్చించేందుకు ఈ రోజు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లారు. చెన్నై వెళ్లిన కేసీఆర్‌కి స్టాలిన్ సాదరంగా ఆహ్వానం పలికారు.
ఆ తర్వాత వారు నేరుగా డీఎంకే అధినేత కరుణానిధి ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో కేసీఆర్ కరుణానిధితో భేటీ అయ్యారు. కుశల ప్రశ్నలు వేసి ఆయన ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా అడిగారు. ఆ తర్వాత స్టాలిన్ ఇంటికి ఆయనతో కలిసి వెళ్లిన కేసీఆర్ ఆయనతో కొద్దిసేపు భేటీ అయ్యి కొన్ని విషయాలు చర్చించారు. తర్వాత ఆయన ఇంటిలోనే మధ్యాహ్న భోజనం చేశారు. ఆ తర్వాత మళ్లీ ఆయనతో భేటీ అయ్యి ఫెడరల్ ఫ్రంట్ గురించి సుదీర్ఘ చర్చలు చేశారు. ఈ రోజు రాత్రి కూడా కేసీఆర్ చెన్నైలోనే బస చేయనున్నట్లు సమాచారం.
స్టాలిన్‌తో చర్చలు జరపడానికి చెన్నై వెళ్లిన కేసీఆర్ వెంట ఎంపీలు కేశవరావు, వినోద్, మంత్రి ఈటల రాజేందర్ కూడా ఉండడం విశేషం. స్టాలిన్‌తో భేటీ జరిగాక కేసీఆర్ బయటకు వచ్చి అక్కడున్న మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. భారత్ గొప్ప సమాఖ్య వ్యవస్థగా మారాలని.. అందుకే ఫెడరల్ ఫ్రంట్ గురించి దక్షిణాది రాష్ట్రాలు కలిసికట్టుగా ఆలోచించాలని తెలిపారు.
జపాన్ స్థాయి అభివృద్ధి భారతదేశంలో కనిపించలేదని.. రాష్ట్రాలపై కేంద్ర పాలకుల పెత్తనం పోయినప్పుడే ప్రజలు అభివృద్ధి పథంలో పయనిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని తాను ఎప్పుడూ అనలేదని.. అది కేవలం ఆలోచన మాత్రమేనని కేసీఆర్ అన్నారు. అయితే ఫెడరల్ ఫ్రంట్ వస్తే ఎలా ఉంటుందన్న విషయం గురించి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో కూడా మాట్లాడానని కేసీఆర్ అన్నారు.