తెలంగాణ సీఎం కేసీఆర్ మరోమారు ఫెడరల్ ఫ్రంట్ ప్రస్తావన తీసుకొచ్చారు. నిజామాబాద్ ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణతో పాటు దేశ ప్రజలు కాంగ్రెస్- బీజేపీ పాలనతో విసిగి పోయారని విమర్శించారు. ఈ సారి సార్వత్రిక ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా ఉంటుందని జోస్యం చెప్పారు. ఎన్నికల తర్వాత రాష్ట్ర హక్కులను కాపాడే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడుతుందన్నారు.
ఫెడరల్ ఫ్రంట్ తోనే దేశ అభివృద్ధి సాధ్యమన్నారు. అనేక వేధికగాపై ఫెడరల్ ఫ్రంట్ ఆవశ్యకతను వివరించానని తెలిపారు. తన నోటి నుంచి ఫెడరల్ ఫ్రంట్ ప్రస్తావన తీసుకువస్తుంటే జాతీయ పార్టీల పీఠాలు కదిలిపోతున్నాయని..బడా నేతల్లో వణుకుపడుతుందని కాంగ్రెస్-బీజేపీ నేతలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.
నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..ఒక్కపుడు నిజామాబాద్ జిల్లా ధనిక జిల్లాగా పేరుగాంచింది. సమైక్యపాలకుల పుణ్యమని నిజాంసాగర్ ఎండిపోయేది. ఉమ్మడి పాలనలో వేలాదిమంది నిజామాబాద్ బిడ్డలు గల్ఫ్ దేశాలకు వలసపోయారు. ఎర్రజొన్న రైతులు ధర రావడం లేదని బాధపడుతున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తర్వాత కొన్ని సమస్యలు పరిష్కరించాము... ఇంకా కొన్ని సమస్యలు పరిష్కరించుకోవాల్సి ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.