హైదరాబాద్‌లో ప్రఖ్యాత ఎల్బీ నగర్ చౌరస్తా మూసివేత

Last Updated : Oct 9, 2017, 11:25 AM IST
హైదరాబాద్‌లో ప్రఖ్యాత ఎల్బీ నగర్ చౌరస్తా మూసివేత

హైదరాబాద్‌లో ఎప్పుడూ రద్దీగా ఉండే ఎల్బీ నగర్ చౌరస్తా ప్రాంతాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ట్రాఫిక్ జామ్ సమస్యను పరిష్కరించడం కోసం మరియు మైట్రోరైలు పనులు, స్కైవే పనులకు అంతరాయం తలెత్తకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని రాచకొండ ట్రాఫిక్‌ డీసీపీ రమేష్‌, అదనపు డీసీపీ దివ్యచరణ్‌రావు, ఏసీపీ శ్రీధర్‌లు తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం నుండి ఎల్బీ నగర్చౌరస్తాను బంద్ చేసి ఎల్‌పీటీ మార్కెట్‌,  డీమార్ట్‌‌ల ముందు యు టర్న్‌లు తెరవడానికి ఏర్పాటు చేస్తున్నారు. అయితే చౌరస్తా మూసివేస్తున్నారు కాబట్టి,  విజయవాడ నుంచి ఉప్పల్‌ వెళ్లే వాహనదారులు ఎల్బీనగర్‌ చౌరస్తా దాటాక డీ మార్ట్‌ వద్ద కుడివైపు యు టర్న్‌ తీసుకోవాలి అని ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి సాగర్‌ రింగ్‌ రోడ్డువైపు వెళ్లేవారు చౌరస్తా దాటాక ఎల్పీటీ మార్కెట్‌ వద్ద కుడివైపు యు టర్న్‌ తీసుకోవాలి. అదేవిధంగా, ఉప్పల్‌ నుంచి సాగర్‌ రోడ్డు, దిల్‌సుఖ్‌నగర్‌ వెళ్లేవారు ఎల్బీనగర్‌ చౌరస్తాలో ఎడమవైపు మలుపు తీసుకుని ఎల్పీటీ మార్కెట్‌ వద్ద కుడివైపు యు టర్న్‌ తీసుకోవాలి. సాగర్‌ రోడ్డు నుంచి ఉప్పల్‌ వెళ్లే వాహనాలు చౌరస్తాలో ఎడమవైపు మలుపు తిరిగి డీ మార్ట్‌ వద్ద యుటర్న్‌ తీసుకోవాలి. ప్రధానంగా ఆర్టీసీ బస్సులను కూడలి, యు టర్న్‌లకు సమీపంలో ఆపకూడదని, విజయవాడ వెళ్లే బస్సులను ఆరెంజ్‌ ఆస్పత్రి ముందు నిలపాలని ఎల్బీనగర్‌ ట్రాఫిక్‌ ఏసీపీ శ్రీధర్‌ తెలియజేశారు. 

Trending News