రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. ప్రస్తుతం అక్కడ సోషల్ మీడియాలో చిరుత తిరుగుతున్న విజువల్స్ వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏ మూల నుంచి చిరుత పులి దాడి చేస్తుందోనని భయాందోళన చెందుతున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్ బండ-2పై చిరుత సంచరించినట్లు తెలుస్తోంది. దీన్ని జిల్లా ఫారెస్ట్ అధికారులు కూడా ధృవీకరించారు. దీంతో స్థానికంగా ఉన్న రైతులు ఉలిక్కి పడ్డారు. మరోవైపు అటవీ అధికారులు చిరుత సంచరిస్తున్న ప్రాంతాల్లో ఫ్లెక్సీ బ్యానర్లు కూడా కట్టడం విశేషం. ఈ ప్రాంతంలో చిరుతలు, ఎలుగుబంట్లు లాంటివి సంచరిస్తున్నాయి. వాటి బారిన పడవద్దంటూ మనుషులను హెచ్చరిస్తూ అక్కడక్కడా బ్యానర్లు ఏర్పాటు చేశారు. అంతే కాదు.. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు ఒంటరిగా వెళ్లవద్దని సూచించారు.
మరోవైపు అటవీ అధికారులు.. చిరుత సంచరించిన ఆనవాళ్లను గుర్తించారు. దాని కాలి అడుగులను గుర్తించి.. అది ఎటువైపు వెళ్లిందో తెలుసుకున్నారు. ఐతే ఇప్పటి వరకు చిరుత జాడ మళ్లీ కనిపించలేదు. కానీ దాన్ని త్వరలోనే పట్టుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు. కానీ చిరుత సంచరిస్తున్న ప్రాంతంలోని చుట్టు పక్కల గ్రామాల్లోని ప్రజలు మాత్రం బిక్కుబిక్కుమని ప్రాణాలు అరచేతీలో పెట్టుకుని బతుకుతున్నారు.