Munugode Bypoll : బీసీ లీడర్లు ఆత్మీయులు కారా.. రెడ్డీలకే రెడ్ కార్పెటా? మునుగోడు టీఆర్ఎస్ లో జగదీశ్ రెడ్డి చిచ్చు..

Munugode Bypoll :  తెలంగాణ రాజకీయాలన్ని ప్రస్తుతం మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి. త్వరలో జరగనున్న ఉప ఎన్నిక ఫలితం వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కీలకం కావడంతో ప్రధాన పార్టీలకు సవాల్ గా మారింది. జగదీశ్ రెడ్డి తీరుపై టీఆర్ఎస్ పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది.

Written by - Srisailam | Last Updated : Sep 25, 2022, 01:06 PM IST
  • మునుగోడు టీఆర్ఎస్ లో చిచ్చు
  • బీసీ లీడర్లకు అందని ఆహ్వానం
  • మంత్రి తీరుపై బీసీ లీడర్ల గుస్సా
 Munugode Bypoll : బీసీ లీడర్లు ఆత్మీయులు కారా.. రెడ్డీలకే రెడ్ కార్పెటా? మునుగోడు టీఆర్ఎస్ లో జగదీశ్ రెడ్డి చిచ్చు..

Munugode Bypoll :  తెలంగాణ రాజకీయాలన్ని ప్రస్తుతం మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి. త్వరలో జరగనున్న ఉప ఎన్నిక ఫలితం వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కీలకం కావడంతో ప్రధాన పార్టీలకు సవాల్ గా మారింది. మునుగోడులో గెలుపు కోసం పోటాపోటీ వ్యూహాలు రచిస్తున్నాయి. కోమటిరెడ్డి పార్టీలో చేరినప్పటి నుంచి  దూకుడు మీదున్న బీజేపీ మునుగోడులో తన బలగాన్ని మోహరించింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలంతా మునుగోడులో తిరుగుతున్నారు. అధికార పార్టీలో మాత్రం అంతా తానై వ్యవహరిస్తున్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. గత రెండు నెలలుగా మునుగోడులో మకాం వేశారు. రాజగోపాల్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా గల్లీగల్లీ తిరుగుతున్నారు. అయితే జగదీశ్ రెడ్డి తీరుపై టీఆర్ఎస్ పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. రెడ్డి లీడర్లకు ప్రాధాన్యత ఇస్తూ బీసీ లీడర్లను ఆయన పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మంత్రి ఏకపక్ష విధానాలతో పార్టీకి నష్టం జరుగుతుందనే టాక్ వస్తోంది.

బీసీ లీడర్లను పట్టించుకోరనే ఆరోపణలు మంత్రి జగదీశ్ రెడ్డిపై మొదటి నుంచి ఉన్నాయి. మునుగోడు నుంచి  పోటీ చేసేందుకు  భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ మాజీ విప్ కర్నె ప్రభాకర్, నారబోయిన రవి ముదిరాజ్, కర్నాటి విద్యాసాగర్ పోటీ పడ్డారు. మునుగోడు నియోజకవర్గంలో బీసీ వాదం బలంగా ఉంది. నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లలో 67 శాతం మంది బీసీ ఓటర్లే. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మరో 24 శాతం ఉన్నారు. బీసీలు ఎక్కువగా ఉన్నా ఇప్పటివరకు మునుగోడు నుంచి బీసీ నేత ఎమ్మెల్యే కాలేదు. అందుకే ఈసారి బీసీ వాదం బలంగా వినిపిస్తోంది. అయితే మంత్రి జగదీశ్ రెడ్డి మాత్రం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఉన్నారు. కూసుకుంట్లకు టికెట్ ఇస్తే అంతా తానూ చూసుకుంటానని.. గెలిపించికుని వస్తానని సీఎం కేసీఆర్ కు జగదీశ్ రెడ్డి మాట ఇచ్చారని అంటున్నారు. కూసుకుంట్ల కోసం ప్రచారం చేస్తున్న జగదీశ్ రెడ్డి.. బీసీ లీడర్లను అవమానిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.గత రెండు నెలలుగా మునుగోడులో తిరుగుతున్న జగదీశ్ రెడ్డి.. బీసీ లీడర్లను కలుపుకుని పోవడం లేదని అంటున్నారు.

బీసీ లీడలను ఎందుకు ఆహ్వానిండం లేదు?

గతంలో భువనగిరి ఎంపీగా పని చేశారు బూర నర్సయ్య గౌడ్. భువనగిరి లోక్ సభ పరిధిలోనే మునుగోడు అసెంబ్లీ ఉంటుంది. అయినా మునుగోడులో జరుగుతున్న ప్రచారానికి, సమావేశాల గురించి బూరకు మాట మాత్రం కూడా చెప్పడం లేదు. నియోజకవర్గానికే చెందిన  ప్రభుత్వ మాజీ విప్ కర్నెకు కనీస సమాచారం ఇవ్వడం లేదు. కొన్ని రోజులుగా మండలాల వారీగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. ఆత్మీయ సమావేశాలకు కూడా బీసీ లీడర్లకు ఆహ్వానం లేదు. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ సొంతూరు సంస్థాన్ నారాయణ పురం. ఇక్కడ నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి కర్నెకు పిలుపు లేదు. ఈ సమావేశానికి వచ్చిన మండల కార్యకర్తలు.. కర్నె కనిపించకపోవడంతో అవాక్కైన పరిస్థితి. టికెట్ ఆశించిన కర్నాటి విద్యాసాగర్ నాంపల్లి మండలానికి చెందినవారు. నాంపల్లిలో జరిగిన ఆత్మీయ సమావేశానికి ఆయనకు సమాచారం లేదు. ఆత్మీయ సమావేశాలు అంటేనే పార్టీ నేతలంతా కలిసి వేడుక చేసుకోవడం. అలాంటి ఆత్మీయ సమావేశాలకు పార్టీలోని కీలక నేతలను పిలవకపోవడం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి.  

బీసీ వర్గాలపై రాజగోపాల్ రెడ్డి ఫోకస్?

మునుగోడులో ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ కు తీవ్రమైన పోటీ ఉంది. తమకు కలిసివచ్చే ఏ ఒక్క అవకాశాన్ని విపక్ష పార్టీలో వదులుకోవడం లేదు. గ్రామాల వారీగా బలమైన నేతలను గుర్తించి పార్టీలో చేర్చుకుంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నియోజకవర్గంలో బలంగా ఉన్న బీసీ వర్గాలపై ఆయన ఎక్కువ ఫోకస్ చేశారు. కులసంఘాలతో సమావేశాలు జరిపి గుడులు, కమ్యూనిటీ హాళ్ల కోసం తాయిలాలు ఇస్తున్నారు. బీజేపీ అలా దూసుకుపోతుంటే.. మంత్రి జగదీశ్ రెడ్డి మాత్రం బలమైన బీసీ లీడర్లను అవమానిస్తున్నారనే చర్చ నియోజకవర్గంలో సాగుతోంది. తనకు పార్టీ సమావేశాలకు ఆహ్వానం అందడం లేదని బూర నర్సయ్య గౌడ్ ఓపెన్ గానే వ్యాఖ్యానించారు. అయినా మంత్రి తీరు మాత్రం మారలేదు.

మంత్రి జగదీశ్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారా?

మాజీ ఎంపీ బూర. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విషయంలో మంత్రి జగదీశ్ రెడ్డి కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. భవిష్యత్ లో తనకు మంత్రి పదవికి పోటీ వస్తారనే భయంతోనే జగదీశ్ రెడ్డి ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  జగదీశ్ రెడ్డి తీరుపై ఆగ్రహంగా ఉన్న బీసీ సంఘాలు.. ఉప ఎన్నికలో తమ సత్తా చూపిస్తామని హెచ్చరిస్తున్నాయి.  మునుగోడులో గౌడ ఓటర్లే ఎక్కువ. గౌడ వర్గానికి చెందిన బూరను జగదీశ్ రెడ్డి దూరం పెట్టడంతో ఆ వర్గ జనాలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. కర్నె విషయంలో తెలంగాణ ఉద్యమకారులు, పార్టీలోని పాత నేతలు గుర్రుగా ఉన్నారు. కర్నాటి విద్యాసాగర్ ను అవమానిస్తే దాని ప్రభావం చేనేత ఓటర్లపై ప్రభావం చూపనుంది. మునుగోడులో పద్మశాలీ ఓటర్లు గెలుపోటములను ప్రభావితం చేస్తే స్థాయిలో ఉన్నారు. మునుగోడు నేత నారబోయిన రవి సామాజిక వర్గమైన ముదిరాజులు ఎక్కువే. ఈ వర్గాలన్ని మంత్రి జగదీశ్ రెడ్డి తీరుపై భగ్గుమంటున్నారు. మొత్తంగా బీసీ లీడర్లను అవమానించేలా ఉన్న మంత్రి జగదీశ్ రెడ్డి తీరుతో మునుగోడులో టీఆర్ఎస్ మునగడం ఖాయమనే చర్చే నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది.

Also Read: MS Dhoni: రేపు సోషల్‌ మీడియా లైవ్‌లోకి ఎంఎస్ ధోనీ..ఆ విషయాన్నే చెప్పబోతున్నాడా..?

Also Read:  NTR 30 Shoot: కొరటాల టెన్షన్ తీర్చేసిన ఎన్టీఆర్.. ఆ ఒక్క మాటతో అంతా క్లియర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News