తెలంగాణలో పంచాయతి ఎన్నికల్లో భాగంగా నేడు తొలి విడుత పోలింగ్ ప్రారంభమైంది. తొలి విడుతలో భాగంగా 3,701 పంచాయతీలకుగాను 12,202 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పోలింగ్ నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో అధికారులు, పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహించనుండగా భోజనం అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి వెంటనే ఫలితాలను వెల్లడించనున్నారు. ఫలితాల అనంతరం అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఫలితాలు వెల్లడించిన అనంతరం గెలిచిన వార్డు సభ్యుల్లోంచి ఒకరిని గ్రామ ఉప సర్పంచ్‌గా ఎన్నకుంటారు. ఎన్నికల నిర్వహణ సందర్భంగా అభ్యర్థులు, ఓటర్లలో ఎవరు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినా ఎన్నికల నియమావళి ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.