తెలంగాణలో ఆదివారం కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష జరగనుంది. పరీక్ష నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్ష నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 966 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి నిర్ణీత సమయానికి ముందే చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సివిల్, తదితర విభాగాల్లో 16,925 పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న పరీక్షకు సుమారు 4.5 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
మొత్తం 16,925 కానిస్టేబుల్ పోస్టులకుగాను (పోలీస్ సివిల్, ఆర్మ్‌డ్ రిజర్వ్, టీఎస్‌ఎస్‌పీ, ఎస్‌పీఎఫ్‌తో పాటు ఫైర్‌మెన్ పోస్టులు) రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాతపరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఇప్పటికే పోలీసు నియామక బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
ఇవీ నిబంధనలు:
- పరీక్షకు నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.
- అభ్యర్థులను గంట ముందు నుంచే హాల్లోకి అనుమతిస్తారు.
- అభ్యర్థులు తమ వెంట పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్‌లలో ఏదో ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లాలి.
- బ్లూ, బ్లాక్ బాల్‌పెన్.. అదనంగా మరో పెన్ను తీసుకెళ్లడం మినహా ఎలాంటి వస్తువులను వెంట తీసుకెళ్లరాదు.
- బయోమెట్రిక్ విధానం ద్వారా అభ్యర్థుల వేలిముద్రలు తీసుకుంటారు.
- పరీక్ష హాల్‌లో అభ్యర్థి ఫొటోలను తీస్తారు. దీంతో ఒకరి బదులు మరొకరు పరీక్ష రాయడానికి ప్రయత్నిస్తే సులువుగా దొరికిపోతారు. అట్టి వారిపై కేసులు కూడా నమోదు చేస్తారు.
- చేతులకు గోరింటాకు ఉండకూడదు.ఆభరణాలు ధరించకూడదు.
- చేతి గడియారం, ఎలక్ట్రానిక్ పరికరాలు, పర్సులు, హ్యాండ్ బ్యాగులను పరీక్షా హాల్లోకి తీసుకురాకూడదు.