తెలంగాణలో ఆంధ్రా సీఎం చంద్రబాబు పెత్తనం ఏందన్న కేసీఆర్ !

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శలకు తనదైన స్టైల్లో జవాబిచ్చిన కేసీఆర్ !

Last Updated : Nov 28, 2018, 10:14 PM IST
తెలంగాణలో ఆంధ్రా సీఎం చంద్రబాబు పెత్తనం ఏందన్న కేసీఆర్ !

మెదక్‌: డిసెంబర్ 7న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు మహాకూటమినే గెలిపించాలని ప్రజలను కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సర్కార్‌పై చేసిన పలు ఆరోపణలపై తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. రాష్ట్రాన్ని 58 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీ పార్టీలు ఒకవైపు.. నాలుగున్నరేళ్లలోనే రాష్ట్రాన్ని అభివృద్ధిపథంవైపు తీసుకెళ్లిన టీఆర్ఎస్ పార్టీ మరొకవైపు ఉన్నాయని, ఈ ఎన్నికల్లో అసలు పోటీ ఈ రెండింటి మధ్యే ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో పార్టీలు ముఖ్యం కాదని, ప్రజల అభీష్టం గెలవాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత గత నాలుగున్నరేళ్లలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి పనులను చూసి జనం ఓటు వేయాల్సిందిగా ఈ సందర్భంగా కేసీఆర్ ప్రజానికానికి విజ్ఞప్తి చేశారు. 

ఆందోల్‌లో బుధవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఇంకా ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు పెత్తనం అవసరమా? అని ఓటర్లను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు గురించి తెలియక ఆయనను శనిలా నెత్తిన పెట్టుకుందని చంద్రబాబును ఎద్దేవా చేశారు. 

అమిత్ షా ఎన్నికల ప్రచారంపై వ్యంగ్యాస్త్రాలు:
మహాకూటమిపై విమర్శలు గుప్పించిన అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై సైతం కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నారాయణ ఖేడ్‌లో అమిత్ షా హాజరైన సభకు జనాలు రాలేదని, దీంతో అమిత్ షా సభ వెలవెలబోయిందని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఇకనైనా ఢిల్లీ పెత్తనం పోవాలంటే తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు మాత్రమే కాకుండా అన్ని లోక్ సభ స్థానాల్లోనూ టీఆర్ఎస్ గెలిపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. 

Trending News