భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని చర్ల మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఇన్‌ఫార్మర్ నెపంతో చర్ల మండలానికి చెందిన మాజీ ఎంపీటీసి, టీఆర్ఎస్ పార్టీ స్థానిక నేత అయిన నల్లూరి శ్రీనివాస్ రావును మావోయిస్టులు హతమార్చారు. ఈ నెల 8న మావోల చేతిలో కిడ్నాప్ అయిన శ్రీనివాస్ రావును శుక్రవారం ఉదయం మావోయిస్టులు విడుదల చేసినట్టుగా తొలుత వార్తలు వెలువడ్డాయి. కానీ ఆ వార్తల్లో వాస్తవం లేదని.. అవన్నీ వదంతులేనని శ్రీనివాస్ రావు మృతదేహం కనిపించాకే తెలిసింది. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించిన వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దులకు ఆనుకుని వున్న చత్తీస్‌ఘడ్‌లోని సుక్మా జిల్లా పొట్టిపాడు గ్రామం వద్ద శ్రీనివాస్ రావు మృతదేహం లభ్యమైంది. మృతదేహం వద్ద చర్ల ఏరియా కమిటీ కార్యదర్శి శారద పేరుతో ఓ లేఖ లభ్యమైనట్టు తెలుస్తోంది. ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరించినందు వల్లే శ్రీనివాస్ రావును హత్య చేశామని మావోయిస్టులు ఆ లేఖలో పేర్కొన్నట్టు సమాచారం. ఆదివాసీ ప్రజాసంఘాల పేరుతో తమపై దుష్ప్రచారం చేస్తున్నారని లేఖలో మావోయిస్టులు ఆ లేఖ ద్వారా తమ నిరసన వ్యక్తంచేశారు.
శ్రీనివాస్ రావు హత్యతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన చర్ల మండలంతోపాటు భద్రాది కొత్తగూడెం జిల్లా, ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఎర్రంపాడు, పొట్టిపాడు గ్రామాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా కనిపిస్తోంది. మావోయిస్టుల వేట కోసం పోలీసులు కూడా ఏ క్షణమైనా గ్రామాలపై విరుచుకుపడతారనే భయం ఏజన్సీ గ్రామాలు వేధిస్తోంది. మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన శ్రీనివాస్ రావు టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన స్థానిక నాయకుడు అవడంతో అక్కడి ప్రాంతాల ప్రజాప్రతినిధులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిందిగా నేతలను పోలీసులు హెచ్చరిస్తున్నారు. తమ అనుమతి లేనిదే సమస్యాత్మక ప్రాంతాలకు వెళ్లకూడదని ప్రజాప్రతినిధులకు సూచిస్తున్నారు. ఏదేమైనా నల్లూరి శ్రీనివాస్ రావు హత్యతో ఏజెన్సీ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కి పడినట్టయింది.