అవిశ్వాసంపై చర్చకు వస్తే సహకరిస్తాం: తెరాస

లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చకు వస్తే సహకరిస్తామని టీఆర్‌ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు.

Last Updated : Mar 27, 2018, 02:06 PM IST
అవిశ్వాసంపై చర్చకు వస్తే సహకరిస్తాం: తెరాస

లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చకు వస్తే సహకరిస్తామని టీఆర్‌ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు. సోమవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్ ఎంపీల భేటీ జరిగింది. ఈ భేటీలో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. పార్లమెంటులో ఆందోళన బాట నుంచి వెనక్కి తగ్గాలని నిర్ణయించారు. పార్లమెంటులో అవిశ్వాసం చర్చకు వస్తే అందులో పాల్గొనాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. అవిశ్వాసంపై ఓటింగ్‌ జరిగితే టీఆర్‌ఎస్‌ అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోనుందని సమాచారం. కేసీఆర్‌తో సమావేశం అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు.

'రిజర్వేషన్ల కోసం ఎందాకైనా వెళ్తాం. నిరసనలు, ధర్నాలు కూడా చేస్తాం. లోక్‌సభలో నిరసనలు వద్దని నిర్ణయించాం. అవిశ్వాసంపై చర్చకు అవకాశం ఉండాలని కోరుకుంటున్నాం. కేంద్రం ఉద్దేశపూర్వకంగానే వాయిదా వేస్తోంది.'- కే.కేశవరావు, తెరాస రాజ్యసభ సభ్యులు

'వెల్‌లోకి వెళ్లం కానీ.. నిరసన తెలుపుతాం. రిజర్వేషన్ అంశాన్ని చర్చలో చెబుతాం. మా సమస్యల కోసం మేము పోరాటాలు చేస్తే మమ్మల్ని తప్పుబడుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం మేంఒక్కరమే పోరాటం చేయడం లేదు.. అన్నాడీఎంకే కూడా పోరాటం చేస్తోంది.'- జితేందర్ రెడ్డి, తెరాస లోక్‌సభ సభ్యులు

'ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు.. దానిని కచ్చితంగా ఇచ్చి తీరాలి. రెండు తెలుగు రాష్ర్టాలు బాగుండాలన్నదే మా కోరిక. ఏపీ నేతలు తాము అడ్డుకుంటున్నారని అనడం సరికాదు. రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరిగిందని, అన్యాయం చేశారంటూ తమను, తమ ప్రజలను తమ ఉద్యమాలను కించపరిచేలా ఆంధ్ర ప్రాంత నాయకులు మాట్లాడుతున్నారు. ఆ నాయకులు వారి వైఖరి మార్చుకోవాలని విజ్ఞప్తి.'-  ఎంపీ కవిత, తెరాస లోక్‌సభ సభ్యులు

'తెలంగాణ హక్కులను కేంద్రం కాలరాస్తుంది. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. అవిశ్వాస తీర్మానంపై స్పీకర్ చర్చకు అనుమతిస్తే మేము పాల్గొంటాము. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ హక్కులను గాలికొదిలేస్తున్నాయి. ఏపీకి రావాల్సిన హక్కులపై తాము చాలాసార్లు మద్దతు ఇచ్చాం.'-  వినోద్, తెరాస లోక్‌సభ సభ్యులు

Trending News