Munugode Bypoll: రెడ్డీనా.. బీసీనా! మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు?

Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ రావడంతో  టీఆర్ఎస్ అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ముందు నుంచి ప్రచారం జరుగుతున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఇస్తారా లేక నియోజకవర్గంలో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండటంతో ఆ సామాజికవర్గం నేతను బరిలో నిలుపుతారా అన్నది ఆసక్తిగా మారింది.

Written by - Srisailam | Last Updated : Oct 3, 2022, 02:12 PM IST
  • మునుగోడు బైపోల్ షెడ్యూల్ రిలీజ్
  • ఇంకా తేలని టీఆర్ఎస్ అభ్యర్థి
  • రేపోమాపో ప్రకటించనున్న కేసీఆర్
Munugode Bypoll: రెడ్డీనా.. బీసీనా! మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు?

Munugode Bypoll Schedule: నల్గొండ జిల్లా మునగోడు నియోజకవర్గం ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చేసింది. షెడ్యూల్ రాకముందే మునుగోడులో పార్టీల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇప్పుడు పోలింగ్ డేట్ కూడా రావడంతో ప్రచారం తారాస్థాయికి చేరనుంది. సరిగ్గా నెల రోజుల్లో పోలింగ్ జరగనుంది. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఖరారయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి రెడ్డి పేరును ఇప్పటికే ప్రకటించడంతో ఆమె నియోజకవర్గంలో జోరుగా తిరుగుతున్నారు. బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేయడం ఖాయమే. ఆయన కూడా మండలాల వారీగా ఎన్నికల కార్యాలయాలు ప్రారంభిస్తూ ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.

మునుగోడు అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరు ఖరారైందని గతంలో ప్రచారం జరిగింది. ఆగస్టు 20న మునుగోడులో నిర్వహించిన సభలోనే అభ్యర్థి పేరును కేసీఆర్ ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. కాని ఆ సభలో అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే అభ్యర్థిని ప్రకటించకున్నా గత రెండు నెలలుగా నియోజకవర్గంలోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. మునుగోడులో అభ్యర్థిని ఖరారు చేయకుండా టీఆర్ఎస్ వ్యూహాకత్మకంగా వ్యవహరించిందని తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్లకు వ్యతిరేకంగా పార్టీలో నేతలు అసమ్మతి గళం వినిపించడమే ఇందుకు కారణమంటున్నారు. 2014లో మునుగోడులో గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. 2018 ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంచార్జ్ గా కొనసాగుతున్నారు.

మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు టీఆర్ఎస్ నుంచి పలువురు నేతలు పోటీ పడ్డారు. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, శాసనమండలిలో ప్రభుత్వ మాజీ విప్ కర్నె ప్రభాకర్, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి, కర్నాటి విద్యాసాగర్, నారబోయిన రవి ముదిరాజ్ పేర్లు వినిపించాయి. మునుగోడులో 67 శాతం బీసీ ఓటర్లు ఉన్నారు. బీసీ వాదం బలంగా ఉంది. దీంతో నియోజకవర్గంలో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండటం, కూసుకుంట్లకు వ్యతిరేకంగా నేతలు గళమెత్తడం, బీజేపీ, కాంగ్రెస్ లు రెడ్డి అభ్యర్థులను నిలపడంతో అభ్యర్థి విషయంలో టీఆర్ఎస్ ట్విస్ట్ ఇస్తుందా అన్న ప్రచారం కూడా కొన్ని రోజులుగా సాగుతోంది. బూర నర్సయ్య గౌడ్, కర్నె ప్రభాకర్ పేర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నారనే వార్తలు వచ్చాయి. మంత్రి జగదీశ్ రెడ్డి కూసుకుంట్లకు మద్దతుగా ఉండటంతో ఆయనకే టికెట్ ఖరారైందనే ప్రచారం సాగుతోంది.

మరోవైపు నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశాలు నిర్వహించిన మంత్రి జగదీశ్ రెడ్డి.. బీసీ లీడర్లను పిలవలేదనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో జగదీశ్ రెడ్డి టార్గెట్ గా మాజీ ఎంపీ బూర, మాజీ ఎమ్మెల్సీ కర్నెలు బహిరంగంగానే ప్రకటనలు చేశారు. రెండు రోజుల క్రితం కూడా కూసుకుంట్లకు వ్యతిరేకంగా దాదాపు 60 మంది మునుగోడు లీడర్లు హైదరాబాద్ లో రహస్య సమావేశం పెట్టారు. ఇప్పుడు ఎన్నికల సంఘం షెడ్యూల్ రావడంతో అభ్యర్థిని ప్రకటించాల్సిన పరిస్థితి ఉంది. మరీ ముందు నుంచి ప్రచారం సాగుతున్నట్లు కూసుకుంట్ల పేరు ప్రకటిస్తారా లేక ట్విస్ట్ ఇస్తారా అన్నది చూడాలి మరీ..

Read also: Munugode Bypoll: మునుగోడు బైపోల్ డేట్ వచ్చింది.. మోడీ  హైదరాబాద్ టూర్ ఖరారైంది.. బీజేపీ స్కెచ్ మాములుగా లేదుగా ?

Read also: Munugode Bypoll: బ్రేకింగ్.. నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక.. ఈనెల 7 నుంచి నామినేషన్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News