భాగ్యనగరాన వెల్లివిరిసిన 'తెలుగు' వైభవం

ప్రపంచ తెలుగు మహాసభలు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో రంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.

Last Updated : Dec 16, 2017, 05:44 PM IST
భాగ్యనగరాన వెల్లివిరిసిన 'తెలుగు' వైభవం

ప్రపంచ తెలుగు మహాసభలు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో రంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన ఈ వేడుకల్లో అచ్చ తెలుగులో సాగిన ప్రముఖుల ప్రసంగాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి.. ఆలోచింపజేశాయి. తెలుగు భాష ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడానికి అందరూ నడుం బిగించాలని కోరుతూ సాగిన ప్రసంగాల వరదలోని పలు ఆసక్తికరమైన సూక్తులు, చెణుకులు మీకోసం ప్రత్యేకం.

  • ఒక భాషా పండితుడు మరొక భాషా పండితుడిని తయారు చేయాలి. ఒక కవి మరొక కవిని, పండితుడు మరో పండితుడిని తయారుచేసే సంకల్పాన్ని పూనాలి. సమాజానికి మార్గదర్శకులైన గురువుల చేతుల్లోనే భాషా వికాసం ఉంది 
  • అమ్మే మొదటి బడి. జీవితానికి అక్కడే ఒరవడి, మంచి నడవడి అలవాడతాయి
  • తెలుగు భాషను ఉద్ధరించాల్సిన, పరిరక్షించాల్సిన బాధ్యత తెలుగు పండితులపైననే ఉన్నది
  • మల్లినాథ సూరి వంటి గొప్ప వ్యాఖ్యాత పాత మెదక్ జిల్లాకు చెందిన వాడు. కాళిదాసును ప్రపంచానికి పరిచయం చేసినవాడు.. తెలుగువాడు - తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు
  • పాతనగరంలో నివాసం ఉంటున్న షరీఫ్ ఉర్దూలోని ఖురాన్‌ను తెలుగులోకి అనువదించారు, గఫూర్ అనే రచయిత తెలుగులో ఎన్నో పుస్తకాలు రచించి తెలుగు భాషకు సేవచేశారు. దేశంలో నేను దక్షిణ భారతీయుడిని, తెలంగాణలో తెలంగాణ వాదిని, హైదరాబాద్‌లో ఉర్దూ మాట్లాడే ఉర్దూవాదిని.. ఈ ప్రపంచం మొత్తంలో మనదేశం వంటి దేశంలేదు. దేశంలోని అన్ని భాషలు, సంస్కృతులు వేరయినా వాటిని పరిరక్షించుకునేందుకు మనం కృషి చేయాలి - మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ
  • భారతీయ సంస్కృతితో తెలుగు భాషకు విడదీయని బంధం ఉంది. ప్రపంచంలో చాలామంది తెలుగు మాట్లాడుతారు. వారందరినీ ఒక వేదికపైకి తీసుకురావడానికి ప్రభుత్వం చేస్తున్న కృషి సాధారణ విషయం కాదు - ఎంఐఎం శాసనసభాపక్ష నాయకుడు  అక్బరుద్దీన్ ఒవైసీ
  • మనిషిలోంచి ప్రాణం తీస్తే ఎలాగో.. సమాజం నుంచి భాషను తీస్తే అంతే బాధగా ఉంటుంది. అమ్మ అనే మాట గుండె లోతుల్లోంచి వస్తుంది. మమ్మీ అనే పదం పెదాలపైనే వినిపిస్తుంది. మాతృభాషను మృతభాష కానీయొద్దు. దానిని మర్చిపోతే మన అస్తిత్వం ప్రశ్నార్థకమే 
  • తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో యాసలు తెలుగు భాషామ్మతల్లిలో మణిహారాలు
  • ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా గురువు బాధ్యత ఎనలేనిది. గూగుల్‌ గురువుకు ప్రత్యామ్నాయం కాదు భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు
  • కమ్మనైన తెలుగు భాషను భవిష్యత్‌ తరాలు మరచిపోకుండా పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి చేయాలి - మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు
  • కవికి మానవీయ కోణం, సామాజిక దృక్పథం ఉండాలని చెప్పారు. ఒక సిరా చుక్క ఎంతో మందిని కదిలిస్తుంది - తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్
  • వరి నాట్లు వేసేటప్పుడు, వడ్లు దంచేటప్పుడు పాడే పాటలు ఇప్పుడు కనుమరుగయ్యాయి. అలాంటి పాటలను మళ్లీ ప్రజల్లోకి తీసుకురావాలి. తెలంగాణ తెలుగే అసలు తెలుగు అని ప్రపంచానికి చాటి చెబుదాం. భాష ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉండాలి - తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

Trending News