YSRTP-Congress Merger: ఎన్నికలకు సమయం ముంచుకొస్తుండడంతో తెలంగాణలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. అధికార బీఆర్‌ఎస్ పార్టీ దూకుడుగా ఉండగా.. ఇంకా ప్రతిపక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. బీజేపీ కన్నా వేగంగా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలు జారీ చేస్తూనే కేంద్ర నాయకత్వం కూడా ప్రత్యేక దృష్టి సారించింది. ఢిల్లీ స్థాయిలో తెలంగాణ రాజకీయాలు మారుతున్నాయి. ఈ క్రమంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల పార్టీ విలీనం ఢిల్లీ పెద్దలు చూసుకుంటున్నారు. గతంలో పలుమార్లు జరిగిన చర్చలు బుధవారంతో కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, అగ్ర నాయకుడు రాహుల్ గాంధీతో షర్మిల సమావేశం కావడంతో ఇక వైఎస్సార్ టీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనం దాదాపుగా ఖరారైంది. షర్మిల విలీనంపై విస్తృతంగా చర్చలు చేస్తున్నారు.
షర్మిల రాకను తెలంగాణ నాయకత్వం కూడా స్వాగతిస్తోంది. ముఖ్యమంత్రి దివంగత వైఎస్సార్‌పై ఉన్న అభిమానాన్ని కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందాలని చూస్తోంది. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో జగన్ అధికారంలోకి రాగా.. అదే మాదిరి తెలంగాణను కాంగ్రెస్ కూడా పట్టుసాధించాలని చూస్తోంది. ఈ క్రమంలో షర్మిలతో పార్టీ విలీనానికి ఒప్పించారని సమాచారం. 2021లో ప్రారంభించిన పార్టీ మూడేళ్లు కాకుండానే విలీనం చేయడం వెనుక కారణాలు ఏమై ఉంటాయనే చర్చ సాగుతోంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రధాన ప్రతిపక్షాల కన్నా కేసీఆర్ పాలనపై షర్మిల ప్రజా పోరాటాలు తీవ్రంగా చేశారు.
నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వానికి చెమటలు పట్టేలా చేశారు. ఎంత పోరాటం చేసినా రావాల్సినంత గుర్తింపు, తాను అనుకున్నంత ఫేమ్ రాలేదని షర్మిల మదనపడినట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్నికలు వస్తుండడంతో తాను చేసిన పోరాటంతో ప్రజా క్షేత్రంలో గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని గ్రహించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని నెలలుగా ఆమె వైఖరిలో మార్పు వచ్చింది. ప్రజల్లోకి పెద్దగా వెళ్లడం లేదు. ప్రత్యామ్నాయ రాజకీయ వ్యూహం రచించి చివరకు కాంగ్రెస్‌లో విలీనం చేయాలని ఓ నిర్ణయానికి వచ్చారు. అనంతరం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పాటు ఢిల్లీ స్థాయిలో పెద్దలతో జరిపిన చర్చలు ఫలించాయి. తాజా భేటీతో వైఎస్సార్‌టీపీ విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కాగా విలీనం సందర్భంగా షర్మిల పలు విజ్ణప్తులు కాంగ్రెస్ ముందు ఉంచినట్లు విశ్వసనీయ సమాచారం.
పార్టీ విలీనం అనంతరం రాష్ట్ర స్థాయిలో పార్టీ పదవి కావాలని షర్మిల కోరినట్లు తెలిసింది. ఇక రాబోయే ఎన్నికల్లో పాలేరు టికెట్‌పై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. పార్టీ స్థాపన నుంచి పాలేరుపైనే షర్మిల ప్రధానంగా దృష్టి సారించిన విషయం తెలిసిందే. వైఎస్సార్‌టీపీ తరఫున అక్కడి నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడ కార్యకలాపాల కోసం కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తున్నది. ప్రజాక్షేత్రంలో చేసిన పోరాటం కాకుండా చట్టసభలో పోరాటం చేసేందుకు తనకు అవకాశం కల్పించాలని కోరినట్లు తెలుస్తోంది.
తనతోపాటు ఏపూరి సోమన్న టికెట్ కోసం కూడా షర్మిల చర్చించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీటితో పాటు మరికొన్ని డిమాండ్లు కాంగ్రెస్ ముందుంచారు. షర్మిల డిమాండ్లకు కాంగ్రెస్ అధిష్టానం దాదాపు ఒకే అన్నట్లు తెలుస్తోంది. ఒక్క పాలేరు విషయమై పేచీ కొనసాగుతున్నట్లు సమాచారం. పాలేరుపై క్లారిటీ వస్తే వైఎస్సార్‌టీపీ విలీనం దాదాపు ఖాయమే. త్వరలోనే ఆ డిమాండ్‌పై సానుకూల నిర్ణయం వెలువడుతుందని షర్మిల వర్గీయులు ఆశిస్తున్నారు. త్వరలోనే ఖమ్మంలో గానీ పాలేరులోగానీ భారీ బహిరంగ ఏర్పాటుచేసి వైఎస్సార్టీపీని షర్మిల విలీనం చేయనున్నారని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడు తెలిపారు.