పాకిస్తాన్‌ రైలు ప్రమాదం: 74 మంది మృతికి కారణమైన రైలు ప్రమాదానికి కారణం అదే

పాకిస్తాన్‌ రైలు ప్రమాదంపై పాక్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మెద్ వివరణ 

Last Updated : Nov 1, 2019, 05:25 AM IST
పాకిస్తాన్‌ రైలు ప్రమాదం: 74 మంది మృతికి కారణమైన రైలు ప్రమాదానికి కారణం అదే

లాహోర్: పాకిస్థాన్‌లో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 74కి దాటింది. లియాఖత్ పూర్ వద్ద తేజ్‌గామ్ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం సంభవించిన ఘటనలో తొలుత 62 మంది మృతిచెంది, 20 మంది వరకు గాయపడ్డారని వార్తలొచ్చినప్పటికీ.. ఆ తర్వాత మృతుల సంఖ్య మరింత పెరుగుతూ వచ్చింది. తేజ్‌గామ్ ఎక్స్‌ప్రెస్ రైలు కరాచీ నుంచి రావల్‌పిండికి వెళ్తుండగా ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రైలులో అల్పాహారం తయారు చేసేందుకు ఉపయోగించిన గ్యాస్ సిలిండర్ స్టవ్ పేలడం వల్లే తొలుత ఈ ప్రమాదం చోటుచేసుకోగా.. రైలులో ఇతర ప్రయాణికుల వద్ద ఉన్న కిరోసిన్ రైలులో మంటలు చెలరేగడంలో అగ్నికి ఆజ్యం పోసినట్టయిందని పాకిస్తాన్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మెద్ వెల్లడించినట్టుగా టెలిగ్రాఫ్ కథనం పేర్కొంది. మూడు బోగీలకు మంటలు వ్యాపించడంతో ప్రమాదం తీవ్రత పెరగడానికి మరో కారణమైందని పాకిస్తాన్ రైల్వే శాఖ మంత్రి తెలిపారు. 

గత 15 ఏళ్లలో ఇంత ఘోర రైలు ప్రమాదం ఎప్పుడూ చోటుచేసుకోలేదని పాకిస్తాన్ రైల్వే అధికారవర్గాలు తెలిపాయి. ఈ అగ్ని ప్రమాదం అనంతరం ఆ మార్గంగుండా రాకపోకలు సాగించే రైళ్లను దారి మళ్లించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది.

Trending News