ఈత కొట్టేందుకు కొలనులోకి దిగిన ఓ మహిళా స్విమ్మర్‌ని సీ లయన్ ( నీటి సింహం) కాటేసిన ఘటన శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆక్వాటిక్ పార్కులో చోటుచేసుకుంది. సీ లయన్ దాడిలో ఆమె మోకాలికి తీవ్ర గాయమైంది. అయితే, అదే సమయంలో అక్కడే ఈత కొడుతున్న ఓ పారామెడిక్ (ఆస్పత్రి వెలుపల అత్యవసర వైద్య సేవలు అందించే వృత్తి నిపుణులు) ఆమెని రక్షించి ఒడ్డుకు చేర్చాడు. అప్పటికే ఆమె మోకాలు రక్తమోడుతూ కనిపించింది. ఒడ్డుకు చేర్చిన అనంతరం అక్కడే ఆమెకి వైద్య సహాయం అందించంతో ప్రమాదం తప్పింది.
గడిచిన నెల రోజుల్లో ఇదే ఆక్వాటిక్ పార్కులో ఈ తరహాలో సందర్శకులు సీ లయన్స్ దాడికి గురవడం ఇది నాలుగోసారి కావడంతో పార్కుకి వచ్చే వారు అటువైపు వెళ్లాలంటే హడలిపోతున్నారు. సాధారణంగా బయటి ప్రపంచానికి అంతగా పరిచయం లేని ఈ సీ లయన్ జాతి జంతువు ఈ ఘటనలతో ఒక్కసారిగా ప్రచారంలోకొచ్చింది.