Nobel Prize in Literature 2022: ఈ ఏడాది సాహిత్య నోబెల్ ను ఫ్రెంచ్ రచయిత్రి అన్నీ ఎర్నాక్స్(82) దక్కించుకున్నారు. వ్యక్తిగత జ్ఞాపకాల మూలాలను, వైరుధ్యాలను, సామూహిక పరిమితులను ఎక్కడా రాజీపడకుండా, ధైర్యంగా ఆమె (Annie Ernaux) తన రచనల్లో అక్షరబద్ధం చేయడంతో ఈ ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్నారు. తన లైఫ్ తో పాటు చుట్టుపక్కల ఉండేవారి జీవితాలను ఆధారంగా చేసుకుని ఆమె రాసిన నవలలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. లింగం, భాష, వర్గం అంశాలపై స్వీయ అనుభవాలతో విభిన్న కోణాల నుంచి విశ్లేషిస్తూ రచనలు చేయడంలో ఆమె దిట్ట.
1940లో నార్మాండీలోని యెవెటోట్‌లో ఎర్నాక్స్ జన్మించారు. రచయితగా ఆమె ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోన్నారు. 1974లో రాసిన ‘లెస్ ఆర్మోయిరెస్ విడెస్ (క్లీన్‌డ్ అవుట్).. ఎర్నాక్స్ తొలి రచన. ఇది ఆమె బయోగ్రఫీ. కాకపోతే నవలగా రాశారు. ఇప్పటి వరకు ఆమె 30కి పైగా పుస్తకాలు రాశారు. 'లాఫెజ్' పేరిట ఎర్నాక్స్ రాసిన పుస్తకంలో తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని అద్భుతంగా వర్ణించారు. ఆమె రాసిన 'ద ఇయర్స్'’ నవలకు ఎన్నో అవార్డులు సైతం వచ్చాయి.
1901 నుంచి ఇప్పటివరకు 119 మందికి సాహిత్య నోబెల్ అవార్డులు ప్రదానం చేయగా.. ఈ జాబితాలో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికైన 17వ మహిళగా ఎర్నాక్స్ గుర్తింపు పొందారు. ఇప్పటికే ఈ ఏడాదికి సంబంధించి వైద్యం, భౌతిక, రసాయన శాస్త్రాలతో పాటు సాహిత్య నోబెల్ బహుమతుల విజేతలను అనౌన్స్ చేశారు. నోబెల్ శాంతి బహుమతి విజేతను శుక్రవారం, అక్టోబర్ 10న ఆర్థిక రంగంలో నోబెల్ గ్రహీత పేరును ప్రకటిస్తారు. నోబెల్ బహుమతి గ్రహీతలకు 10లక్షల స్వీడిష్ క్రోనర్ (సుమారు 9లక్షల డాలర్లు) నగదు అందజేస్తారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డులను డిసెంబరు 10న విజేతలకు అందజేస్తారు. స్వీడన్ శాస్త్రవేత్త ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ఈ పురస్కారాలను 1901 నుంచి ఇస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook