మాల్దీవుల సంక్షోభం విషయంలో... భారత్ జోక్యం చేసుకుంటుందా..?

ఇప్పుడు తాజాగా మరో వివాదం అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ ఉనికిని ప్రశ్నిస్తోంది.

Last Updated : Feb 8, 2018, 12:50 PM IST
మాల్దీవుల సంక్షోభం విషయంలో... భారత్ జోక్యం చేసుకుంటుందా..?

ఇప్పుడు తాజాగా మరో వివాదం అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ ఉనికిని ప్రశ్నిస్తోంది. దేశ సంక్షోభంలో చిక్కుకున్న మాల్దీవుల ప్రభుత్వం తగు పరిష్కారాల కోసం, సలహాల కోసం మిత్రదేశాలను సంప్రదించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో తన రాయబారులను చైనా, పాకిస్తాన్, సౌదీ అరేబియాలకు పంపించింది. అయితే.. ఈ విషయంలో తనకు బాగా దగ్గరి దేశమైన భారత్‌ను మాత్రం విస్మరించింది.

గతంలో భారత్ మాల్దీవుల సంక్షోభం విషయంలో కొంతలో కొంత తనదైన పాత్ర పోషించాలని భావించినా.. చైనా హెచ్చరికలు జారీ చేయడంతో మిన్నకుండిపోయింది. మాల్దీవుల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని భారత్‌కు అప్పట్లో చైనా సూచించింది. చిత్రమేంటంటే.. మాల్దీవులను పాలిస్తున్న ప్రస్తుత నాయకుడు యమీన్ చైనాకి విధేయుడిగా ప్రయత్నిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

చైనా తరఫున దేశంలో కొన్ని వేల కోట్ల డాలర్లు పెట్టుబడి కూడా పెట్టించారాయన. అలాంటి సందర్భంలో భారత్‌‌తో స్నేహసంబంధాలపై యమీన్ వైఖరి ఏమిటన్నది ప్రశ్నార్థకమే. అయితే మాల్దీవుల ప్రతిపక్షాలు ఇప్పటికీ తమ దేశాన్ని సంక్షోభం నుండి బయట పడేయడంలో భారత్ సహాయం చేయాలని కోరుతున్నాయి.

అయితే ఇస్లామిక్ తీవ్రవాదానికి దగ్గరవవ్వడంతో పాటు చైనాకి కొమ్ము కాయడం లాంటి విషయాలు భారత్‌కు మాల్దీవుల విషయంలో తలనొప్పిగా మారాయి. ఈ క్రమంలో మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఏం చెప్పినా.. భారత్ మాల్దీవుల విషయంలో పెద్దన్న పాత్ర పోషించాలని తెలిపారు. మాల్దీవుల దేశాన్ని విడిచి.. బ్రిటన్‌లో నివసిస్తున్న ఆయన మాట్లాడుతూ వెంటనే భారత్ మాల్దీవులకు తమ రాయబారిని, సైన్యాన్ని పంపించి... నిర్భందంలో ఉన్న రాజకీయ ఖైదీలను విడిపించాలని కోరారు. 1988లో మాల్దీవులు తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పుడు భారత్ అందించిన సహాయ సహకారాలు తాము మరువలేమని ఆయన తెలిపారు. 

Trending News