మదరసాలో చదువుకుంటున్న 8 మంది మైనర్లపై అత్యాచారం చేసిన ఓ టీచర్‌కి దేహశుద్ధి చేసిన స్థానికులు అతడిని పోలీసులకు పట్టిచ్చిన ఘటన బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంది. అత్యాచారానికి గురైన మైనర్ బాలికలంతా 8 ఏళ్ల నుంచి 11 ఏళ్లలోపు వారే. బంగ్లాదేశ్‌లోని నెట్రొకొన జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. తమ అదుపులో వున్న నిందితుడు 33 ఏళ్ల అబుల్ ఖయెర్ బెలాలి నేరాన్ని అంగీకరించినట్టు పోలీసులు ఆదివారం ప్రకటించారు. ఏడాది క్రితం మా హవా ఖవామి బాలికల మదరసాలో టీచర్‌గా చేరిన అబుల్.. స్థానిక మసీదులోనూ పనిచేస్తున్నాడు.
మదరసా సంస్థలో చేరిన 35 మంది బాలికల్లో 8 మందిని అత్యాచారం చేసినట్టు అబుల్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఏడాది కాలంగా ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్టు పోలీసులకు తెలిపాడు. పవిత్రమైన మదరసాలో మైనర్ బాలికలపై అత్యాచారాలకు ఒడిగట్టిన కీచకుడికి కఠిన శిక్ష విధించాలని స్థానికులు డిమాండ్ చేశారు. నెట్రొకొనలో ఆదివారం భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.