నవాజ్ షరీఫ్ అరెస్టు.. జైలుకు తరలింపు

స్వదేశంలో అడుగుపెట్టిన పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్, ఆయన కూతురు మరియమ్‌ అరెస్టయ్యారు. 

Last Updated : Jul 14, 2018, 10:12 AM IST
నవాజ్ షరీఫ్ అరెస్టు.. జైలుకు తరలింపు

స్వదేశంలో అడుగుపెట్టిన పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్, ఆయన కూతురు మరియమ్‌ అరెస్టయ్యారు.  లండన్‌లో అక్రమాస్తులు సంపాదించారని పనామా పత్రాలు వెల్లడించిన కేసులో షరీఫ్‌కు పదేళ్లు, మరియమ్‌కు ఏడేళ్ల జైలుశిక్ష పడింది. శుక్రవారం లండన్ నుంచి వయా అబుదాబి మీదుగా స్వదేశానికి చేరుకున్న ఆయనను లాహోర్‌ విమానాశ్రయంలో దిగగానే పాక్ భద్రతా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. షరీఫ్‌, మరియమ్‌ వద్ద నుండి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరినీ ప్రత్యేక హెలికాప్టర్‌లో ఇస్లామాబాద్‌కు తరలించి.. అక్కడి నుండి రావల్పిండి జైలుకు తరలించారు.

లాహోర్‌లో ఉత్కంఠ..

నవాజ్‌ షరీఫ్‌ రాక సందర్భంగా లాహోర్‌లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ముందస్తుగా లాహోర్‌లో మొబైల్, ఇంటర్నెట్‌ సేవలను నిలిపేశారు. విమానాశ్రయానికి భారీగా తరలివచ్చిన వందలాది షరీఫ్‌ మద్దతుదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో రెండు వారాల్లో పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో పాక్‌లో అడుగుపెట్టడం మంచి నిర్ణయమేనా? అని అబుదాబి విమానాశ్రయంలో విలేకరులు షరీఫ్‌ను ప్రశ్నించగా.. దేశంలోని పరిస్థితుల గురించి తెలుసని.. దేశ తలరాత మార్చేందుకే తాను స్వదేశానికి వెళ్తున్నట్లు చెప్పారు.

Trending News