నెల్సన్ మండేలా సతీమణి విన్నీ మృతి

దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా సతీమణి మరియు జాతివివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన సామాజికవేత్త విన్నీ మండేలా ఈ రోజు మరణించారు.

Last Updated : Apr 2, 2018, 08:41 PM IST
నెల్సన్ మండేలా సతీమణి విన్నీ మృతి

దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా సతీమణి మరియు జాతివివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన సామాజికవేత్త విన్నీ మండేలా ఈ రోజు మరణించారు. ఈమెకు 81 సంవత్సరాలు. "దక్షిణాఫ్రికా జాతిమాత"గా ఆమెను ఆ దేశస్థులు కొందరు పిలుచుకుంటూ ఉంటారు. నల్ల జాతీయుల హక్కుల కోసం ఆమె పోరాటం చేశారు. తనకు 38 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నెల్సన్ మండేలా విన్నీని రెండవ వివాహం చేసుకున్నారు.

1996లో ఈ దంపతులు విడాకులు తీసుకున్నారు. 1936లో కేప్ టౌన్‌లో జన్మించిన విన్నీ, జోహన్నస్‌బర్గ్‌‌లో సోషల్ వర్క్ చదవడానికి వెళ్లారు. దక్షిణాఫ్రికా కేంద్ర ప్రభుత్వంలో ఆమె పలుమార్లు మంత్రిగా కూడా పనిచేశారు. నెల్సన్ మండేలాను అరెస్టు చేసి జైలుకి పంపించాక, విన్నీ అనేక బాధలను అనుభవించారు. ఆమెను అనేకసార్లు ఇంటి నిర్భందంలో ఉంచారు. అనేక రకాలుగా హింసించారు కూడా. అయినా వాటిని తట్టుకొని ఆమె ప్రజల హక్కుల కోసం పోరాడారు.

1985లో విన్నీ రాబర్ట్ ఎఫ్ కెన్నడీ మానవ హక్కుల పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. అయినప్పటికీ విన్నీ కొన్ని సందర్భాలలో విమర్శలు ఎదుర్కొన్నారు. హింసను ప్రబోధించేవిధంగా, జనాలను రెచ్చగొట్టే విధంగా ఆమె ప్రసంగాలు ఉంటాయని పలువురు చెబుతుంటారు. పలుమార్లు తన భర్త మండేలా పై కూడా ఆమె విమర్శలు చేశారు. 

Trending News