పని సరిగ్గా చేయలేదని ఉద్యోగుల చేత.. మూత్రం తాగించిన యాజమాన్యం

చైనాలోని ఓ ప్రముఖ హోం రినోవేషన్ కంపెనీ ఉద్యోగులను ఎంతగా హింస పెడుతుందో వింటే విస్మయం కలగకమానదు. 

Last Updated : Nov 9, 2018, 10:29 AM IST
పని సరిగ్గా చేయలేదని ఉద్యోగుల చేత.. మూత్రం తాగించిన యాజమాన్యం

చైనాలోని ఓ ప్రముఖ హోం రినోవేషన్ కంపెనీ ఉద్యోగులను ఎంతగా హింస పెడుతుందో వింటే విస్మయం కలగకమానదు. ఇటీవలే ఈ కంపెనీ ఉద్యోగులు పడుతున్న నరకయాతనను సోషల్ మీడియా ద్వారా ఎవరో బహిర్గతం చేయడంతో ప్రభుత్వానికి అసలు విషయం తెలిసింది. గత కొన్నేళ్లుగా ఆ సంస్థ ఉద్యోగులను బానిసలకంటే హీనంగా చూస్తున్నా కూడా.. ఎవరూ ఉద్యోగాలు వదలక పోవడం గమనార్హం. ఉద్యోగంలో చేరేముందే కంపెనీ సైన్ చేయించుకున్న అగ్రిమెంట్ అందుకు కారణమని కూడా తెలుస్తోంది. మధ్యలోనే ఉద్యోగం మానేస్తే.. పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాలని కంపెనీ అగ్రిమెంట్ పైన సంతకం చేయించుకోవడంతో ఉద్యోగాలు మధ్యలో మానలేకపోతున్నామని పలువురు ఉద్యోగులు  వాపోయారు.

అయితే అదే అగ్రిమెంట్ ఆ కంపెనీలో పలువురు సీనియర్ మేనేజర్ల పాలిట వరంగా మారిందట. వారు కార్మికులను బయటకు కూడా వెళ్లనిచ్చేవారు కాదట. కంపెనీలోనే కార్మికులకు వసతి ఏర్పాటు చేసేవారు. అలా వసతి   సౌకర్యం పొందిన కార్మికుల పరిస్థితి మరింత దారుణంగా ఉండేదట. పని సరిగ్గా చేయని కార్మికుల చేత మూత్రం తాగించడం, బొద్దింకలను తినిపించడం చేసేవారు. అలాగే జీతాన్ని కూడా పూర్తిగా ఇచ్చేవారు కాదు. తాము ట్రాప్  చేయబడ్డామని ఆ ఉద్యోగులకు తర్వాత తెలిసిందట. అదీ ఆ సంస్థలో పనిచేసే కింది స్థాయి ఉద్యోగుల పరిస్థితి.

అలాగని ఆ కంపెనీలో సీనియర్ స్థాయి ఉద్యోగుల పరిస్థితి కూడా పెద్ద గొప్పగా ఏమీ లేదట. ఫార్మల్ డ్రెస్ కోడ్ పాటించని ఉద్యోగులకు జీతంలో 7 డాలర్లు కోతగా విధించడం ఆ కంపెనీ రూల్. ప్రతీ రోజూ డ్రెస్ కోడ్‌లో తప్పులు కనిపెట్టడానికి కూడా ఆ కంపెనీలో ఒక టీమ్ ఉంది. ఈ టీమ్ డ్రెస్ కోడ్ పాటించని ఉద్యోగులకు పెద్ద తలనొప్పిగా తయారైందని.. కావాలని జీతంలో కోత విధించేందుకు చిన్న చిన్న తప్పులను కూడా పెద్దవిగా చేసి చూపించడం చేస్తున్నారని ఉద్యోగులు వాపోయారు. ఇటీవలే ప్రభుత్వం ఈ సంస్థపై ప్రత్యేక నిఘా పెట్టింది. తాజాగా ఈ కంపెనీ యాజమాన్యానికి చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. అయితే వారికి కేవలం 10 రోజులే జైలుశిక్ష విధించడంతో అందరూ  ఆశ్చర్యపోయారు. అయితే ఇలాంటి కంపెనీలు చైనాలో చాలా ఉన్నాయని తెలుస్తోంది. అక్కడి కార్మిక సంఘాలు.. ఇలాంటి కంపెనీలకు పర్మిషన్ ఇవ్వవద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. 

Trending News