చైనా అధ్యక్షుడితో సుష్మాస్వరాజ్ భేటీ

భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ రోజు చైనా రాజధాని బీజింగ్‌లో ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్‌తో కొద్దిసేపు సమావేశమయ్యారు.

Last Updated : Apr 23, 2018, 05:59 PM IST
చైనా అధ్యక్షుడితో సుష్మాస్వరాజ్ భేటీ

భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ రోజు చైనా రాజధాని బీజింగ్‌లో ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్‌తో కొద్దిసేపు సమావేశమయ్యారు. షాంగాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సుకు హాజరైన ఆమె ఈ సందర్భంగా అధ్యక్షుడితో మాట్లాడారు. ఈ రోజు ఆ సదస్సులో భాగంగా నిర్వహించిన మీడియా సమావేశంలో సుష్మా స్వరాజ్ "భారత్, చైనా స్నేహబంధానికి వారధిగా హిందీ భాష" అనే అంశంపై ప్రసంగించారు.

అలాగే నిన్న జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ భారత్, చైనా దేశాలు ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయడానికి పరస్పరం సహకరించుకుంటున్నాయని అన్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య వికాసం లాంటి అంశాల్లో ఇరుదేశాలు కలసి పనిచేస్తున్నాయని తెలియజేశారు. సుష్మ స్వరాజ్ అతన రెండు రోజుల చైనా పర్యటనలో భాగంగా ఎస్‌‌సీఓ సదస్సులో పాల్గొనడంతో పాటు మంగోలియా ప్రాంతాన్ని కూడా సందర్శిస్తారు. 

2017 సంవత్సరం నుండి భారత్  షాంగాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సంస్థలో పూర్తిస్థాయి సభ్యత్వాన్ని కలిగి ఉండడం విశేషం. అలాగే భారత్, చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు కూడా త్వరలోనే జరగనున్నాయి. ఏప్రిల్ 27, 28 తేదిలలో ఈ సమావేశాలు భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌ల మధ్య సెంట్రల్ చైనా సిటీ వుహాన్ ప్రాంతంలో జరగనున్నాయి. ఈ విషయాన్ని ఇటీవలే చైనా విదేశాంగ శాఖ తెలిపింది.

ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్, చైనా దేశాలు తమదైన శైలిలో పుంజుకుంటున్న క్రమంలో ఈ ద్వైపాక్షిక సమావేశాల పట్ల ప్రపంచ ఆర్థిక నిపుణుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అలాగే భారత్ నుండి సోయాబీన్ దిగుమతి చేసుకొంటున్న విషయంలో వస్తున్న పలు చిన్నపాటి వివాదాలను కూడా ఈ సమావేశాల్లో పరిష్కరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Trending News