త్వరలో.. అన్న విలేజ్ మాల్స్

రేషన్ షాపులను 'అన్న విలేజ్ మాల్స్' గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. 

Last Updated : Oct 14, 2017, 01:14 PM IST
త్వరలో.. అన్న విలేజ్ మాల్స్

రేషన్ షాపులను 'అన్న విలేజ్ మాల్స్' గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రం మొత్తం మీద ఉన్న 29,000 రేషన్ షాపులను 'అన్న విలేజ్ మాల్స్' గా మార్చనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తొలిదశలో 6,500 చౌక దుకాణాలకు మాల్స్ గా కొత్త రూపు తీసుకురావాలని నిర్ణయించారు. తక్కువ ధరకే నాణ్యమైన వస్తువులను ప్రజలకు అందించాలనే లక్ష్యంతో  ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం సూచించారు. 

రిలయన్స్, ప్యూచర్ గ్రూప్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్న ఈ మాల్స్ లను అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్ది, లోగో సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న 'అన్న విలేజ్ మాల్'  వ్యయంలో ప్రభుత్వం 25% భరిస్తూ, మరో 25% ముద్ర బ్యాంక్ ద్వారా రుణాన్ని ఇప్పించనుంది. ఈ మాల్ లో డ్వాక్రా, మెప్మా, జీసిసి  ఉత్పత్తులతో సహా ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన వ్యవసాయ ఉత్పత్తులను ఉంచనుంది. తెలుగువారి నోరూరించే పచ్చళ్ళు, బందరు లడ్డు, కాకినాడ కాజా మరియు ఇతర స్వీట్స్ కూడా ఇందులో లభిస్తాయి. ఎవరైనా సరే 'అన్న విలేజ్ మాల్' లో తమ ఉత్పత్తులు అమ్ముకొనే విధంగా వెసులుబాటు కల్పించింది.  

వచ్చే ఏడాది నుంచి సగం ధరకే చెక్కర

కేంద్రం సబ్సిడీ ఎత్తివేసినా తెల్లకార్డు దారులకు నూతన సంవత్సర కానుకగా వచ్చే రేషన్‌లో అరకిలో చక్కెరను జనవరి నుంచి సగం ధరకే  వినియోగదారులకు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.  ప్రత్యేక అవసరాలు ఉన్న కూరాకుల, రజక, మత్య్సకార తదితర సామాజికవర్గాలకు తెల్ల కిరోసిన్‌ ఇవ్వాలని తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 4,599 చౌక ధరల దుకాణాలకు డీలర్లను నియమించాలని అధికారులను ఆదేశించారు.  

 

Trending News