సొంత అవసరాలకి పోలీస్‌స్టేషన్‌ను తాకట్టు పెట్టిన ఘనుడు

అప్పు అవసరమైతే ఏ పొలమో.. ఇల్లో.. బంగారమో తాకట్లు పెట్టి డబ్బులు తీసుకుంటాం..

Last Updated : May 4, 2018, 03:07 PM IST
సొంత అవసరాలకి పోలీస్‌స్టేషన్‌ను తాకట్టు పెట్టిన ఘనుడు

అప్పు అవసరమైతే ఏ పొలమో.. ఇల్లో.. బంగారమో తాకట్లు పెట్టి డబ్బులు తీసుకుంటాం. కానీ ఈ ఘనుడు చేసిన నిర్వాకం చూస్తే ఎవ్వరైనా నోరెళ్లబెట్టాల్సిందే..! ఏకంగా అప్పు కోసం పోలీస్ స్టేషన్‌నే తాకట్టు పెట్టి ఎంజాయ్ చేశాడు. అయితే అసలు విషయం వెలుగులోకి రావడంతో అందరూ ఔరా..! ఇలా కూడా చేస్తారా అని అనుకుంటున్నారు.
 
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఏపీలోని కర్నూలు జిల్లాలో టి.నాగేశ్వరరావు అనే ఓ వ్యక్తి గోనెగండ్ల మేజర్ పంచాయితీకి మాజీ సర్పంచ్. ప్రస్తుతం ఇతని భార్య ఆ ఊరి సర్పంచ్. 1993వ సంవత్సరంలో నాగేశ్వరరావుకి డబ్బుల అవసరం వచ్చింది. దీంతో గోనెగండ్లలోని 106, 35, 114, 452 సర్వే నెంబర్లపై సహకార సంఘం మార్ట్ గేజ్ కింద రూ.10వేల అప్పు తీసుకున్నాడు.

అందులో పోలీస్ స్టేషన్ కూడా ఉంది. గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 452లో పోలీస్ స్టేషన్‌తోపాటు పోలీస్ శాఖకు కేటాయించిన 4.13 ఎకరాల భూమి కూడా ఉంది. ఈ భూమిని తాకట్టుపెట్టి గోనెగండ్ల సింగిల్ విండో ద్వారా కోడుమూరు కేడీసీసీ బ్యాంక్ నుంచి 10వేల రూపాయలను నాగేశ్వరరావు లోన్ తీసుకున్నాడు. కొన్నాళ్ల క్రితం ఈ అప్పులను రుణమాఫీ పథకంలో భాగంగా అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది. అయితే మార్ట్ గేజ్ లోన్‌కు సంబంధించిన ఒప్పందాన్ని కోడుమూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రద్దు చేయించలేదు. దీంతో ఆ అప్పు అలాగే ఉండిపోయింది.

ఇటీవలే పోలీస్ శాఖ సిబ్బంది క్వార్టర్స్ పున:నిర్మాణం చేపట్టాలని నిర్ణయించి.. కోడుమూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఈసీ తీయించారు. పోలీస్ స్టేషన్‌తోపాటు ఆ స్థలం కూడా తాకట్టులో ఉందని తెలిసి షాక్ అయ్యారు. విషయంపై విచారిస్తే.. అది గోనెగండ్ల మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ పనే అని తేలింది. దీంతో అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్‌ను తాకట్టు పెట్టి మరీ బ్యాంక్ అప్పు తీసుకోవటం అనేది బహుశా దేశంలో ఇదే తొలిసారి కావొచ్చు అంటున్నారు కొందరు.

Trending News