అగ్రిగోల్డ్ కీలక నిందితుడికి రిమాండ్

అగ్రిగోల్డ్ కేసులో ప్రధాన నిందితుడు మరియు ఆ సంస్థ మాజీ డైరెక్టర్ అవ్వా సీతారామారావుకు ఏలూరు జిల్లా కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది.

Last Updated : May 24, 2018, 03:42 PM IST
అగ్రిగోల్డ్ కీలక నిందితుడికి రిమాండ్

అగ్రిగోల్డ్ కేసులో ప్రధాన నిందితుడు మరియు ఆ సంస్థ మాజీ డైరెక్టర్ అవ్వా సీతారామారావుకు ఏలూరు జిల్లా కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. కోర్టు రిమాండ్ విధించాక, పోలీసులు నిందితుడిని జైలుకి తీసుకెళ్లారు. కొన్ని సంవత్సరాలుగా పోలీసుల కళ్లు కప్పి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో తలదాచుకున్న సీతారామారావును పోలీసులు ఇటీవలే నిర్భందించారు. తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాకోర్టులో హాజరుపరిచారు.

సీతారామారావు పై ఇప్పటికే అనేక కేసులు ఉన్నాయి. కాగా ప్రధానమైన అగ్రిగోల్డ్ చీటింగ్ కేసులో సీతారామారావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కూడా ఆరోపణలు ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలుగా అగ్రిగోల్డ్ సంస్థకు డైరెక్టరుగా ఉన్న సీతారామారావు బినామీల పేరు మీద ఎన్నో ఆస్తులను పెట్టారని.. ఆ విధంగా కంపెనీ డబ్బును ఆయన దారి మళ్లించినట్లు కూడా వార్తలు వచ్చాయి.

సీతారామారావు 1997 నుంచి 2013 వరకు అగ్రిగోల్డ్ సంస్థకు డైరెక్టరుగా ఉన్నారు. అగ్రిగోల్డ్ ఛైర్మన్ వెంకటరామారావుకి సోదరుడైన సీతారామారావు హైకోర్టు బెయిల్ నిరాకరించాక కొన్నాళ్లు ఎవరికీ కనిపించకుండా పోయారు. ఆయనను కనుగొనేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి కూడా దిగాయి. అగ్రిగోల్డ్ ఆస్తులను కొనడానికి ముందుకొచ్చే సంస్థలను సీతారామారావు అడ్డుకున్నారని ఇప్పటికే అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఆరోపిస్తోంది. 

Trending News