ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్నారై తెలుగు సంఘాలు సంయుక్తంగా నిర్మించడానికి సిద్ధమైన ప్రతిష్టాత్మక ఐకానిక్ టవర్ శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు గురువారం విచ్చేశారు. 33 స్టోరీల బిల్డింగ్ కలిగే ఈ టవర్‌ను రాయపూడి ప్రాంతంలో నిర్మించనున్నారు. క్రిష్ణా నదితీరానికి, త్వరలో ప్రారంభమయ్యే సెంట్రల్ పార్క్ ఏరియాకి దగ్గరలో ఈ టవర్ ఉంటుంది.
ఈ ఐకానిక్ టవర్ ఎక్కి అమరావతిని 360 డిగ్రీ యాంగిల్లో చూడవచ్చని ఇంజనీర్లు అంటున్నారు. భారతదేశంలో ఈ వెంచర్ తొలిసారిగా రాబోతుందని.. ఎన్నారైలు సహకరించడం అనేది మరువలేని విషయమని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ఏపీ ఎన్ఆర్టీ ప్రెసిడెంట్ డాక్టర్ రవి వేమూరు కూడా హాజరయ్యారు. ఈ ప్రాజెక్టులో తాము కూడా భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని తెలిపారు.
"A" ఆకారంలో నిర్మితమయ్యే ఈ టవర్లోని అక్షరం.. అమరావతికి గుర్తు అని .. ఈ టవర్‌లో ప్రముఖ రెస్టారెంట్లు, ఎన్నారైల క్లబ్బు, వరల్డ్ క్లాస్ ఆడిటోరియం, హై ఎండ్ క్లాస్ రూమ్స్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ స్టూడియో మొదలైనవి నెలకొల్పే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఇక్కడే దాదాపు 100 సాఫ్ట్ వేర్ కంపెనీలు ప్రారంభమయ్యేలా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. దాదాపు రూ.500 కోట్లతో ఈ ప్రాజెక్టు తొలి విడత కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.
ఈ ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఓ ప్రకటనను విడుదల చేసింది. "ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా సన్‌రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో భాగస్వాములవ్వాలన్న తపనతో రూపుదిద్దుకున్న ఆలోచన ఎన్ఆర్టి ఐకానిక్ భవన్. రూ.500 కోట్లతో తెలుగువారి కలలకు ప్రతి రూపంగా 33 అంతస్థులతో అమరావతిలో నిర్మిస్తోన్న ఈ భవనానికి శంకుస్థాపన చేయడం గర్వంగా ఉంది.
ముఖ్యంగా టవర్ నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు అభినందనలు. 120 దేశాలలో తెలుగు వారంతా ఒక్కటై పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చి, జన్మభూమి రుణం తీర్చుకోవాలన్న స్ఫూర్తి చాలా గొప్పది. అలాగే గత నాలుగేళ్లలో రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్‌గా, ఇన్నోవేషన్ వ్యాలీగా తీర్చిదిద్దే దిశగా ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇప్పుడు మీ అందరి సహకారంతో మరో అడుగు ముందుకేస్తున్నాం" అని చంద్రబాబు ప్రకటనలో తెలిపారు.