చంద్రబాబుకు మరో షాక్.. ఇల్లు ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు

చంద్రబాబుకు మరో షాక్.. ఇల్లు ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు

Last Updated : Jun 28, 2019, 11:30 AM IST
చంద్రబాబుకు మరో షాక్.. ఇల్లు ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు

అమరావతి: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపి అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ సర్కార్ నుంచి మరో ఇబ్బందికరమైన పరిణామం ఎదురైంది. చంద్రబాబు నాయుడు తన నివాసానికి పక్కనే ఆనుకుని వున్న ప్రజావేదికను తనకే అప్పగించాల్సిందిగా చేసుకున్న విజ్ఞప్తి తోసిపుచ్చిన ఏపీ సర్కార్... ఏకంగా ఆ ప్రజా వేదికనే అక్రమంగా కట్టడంగా తేల్చిచెబుతూ కూల్చివేయించిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ అతిథి గృహానికి సీఆర్డిఏ (క్యాపిటల్ రీజియన్ డెవెలప్‌మెంట్ అథారిటీ) అధికారులు నోటీసులు జారీచేశారు. తాడేపల్లి మండలం, ఉండవల్లి గ్రామ పంచాయతితోపాటు కరకట్ట ప్రాంతాల్లో సీఆర్డిఏ అధికారులు జరిపిన తనిఖీల్లో ఆ నివాసం అక్రమ కట్టడంగా తేలిందని, వారం రోజుల్లోగా స్పందించి సంజాయిషి ఇవ్వకున్నా... ఒకవేళ ఇచ్చిన సంజాయిషీ సంతృప్తికరంగా లేకున్నా.. ఆ నివాసాన్ని అక్రమ కట్టడంగానే భావిస్తూ చట్టరీత్యా చర్యలు తీసుకోక తప్పదని సీఆర్డిఏ అధికారులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 

వాస్తవానికి ఈ నివాసం లింగమనేని రమేష్‌దే అయినప్పటికీ.. ఆ నివాసాన్ని ఏపీ ముఖ్యమంత్రి అధికారిక నివాసం కోసం 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం లీజు కింద తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే ప్రస్తుతం అందులోనే నివాసం ఉంటున్న చంద్రబాబుకు ఇది ఓ ఇబ్బందికరమైన పరిణామంగా పరిణమించింది. 

కృష్ణా నదికి 100 మీటర్లలోపు నిబంధనలకు విరుద్ధంగా ఈ అక్రమ నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందంటూ తమ దృష్టికి వచ్చిన ఆర్‌సిసి రూమ్స్, హెలిప్యాడ్, స్విమ్మింగ్ పూల్, ఇతర షెడ్స్ వంటి పలు నిర్మాణాలను సీఆర్డిఏ ఈ నోటీసుల్లో ప్రస్తావించింది.

Trending News