అమరావతి: రాజధాని మార్పు అంశం చర్చనీయంశంగా మారిన తరుణంలో ఇప్పుడు మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మంత్రి నాని మాట్లాడుతూ అమరావతిపై బొత్స చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని సమర్ధించారు. వాస్తవానికి తమ పార్టీలో జరుగుతున్న చర్చనే బొత్స వెల్లడించారని నాని పేర్కొన్నారు. రాజధాని అమవరాతిలో జరుగుతున్న అవినీతిపై చర్చ జరగాలన్నదే తమ అభిప్రాయన్నారు. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తామని తమ పార్టీ నేతలు ఎక్కడా చెప్పలేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని వెల్లడించారు. వాస్తవానికి రాజధానిని మార్చే ఆలోచన ప్రభుత్వానికి లేదన్న ఆయన.. ఒకవేళ ప్రభుత్వం మార్చాలనుకుంటే ప్రతిపక్ష పార్టీల ఉద్యమాలు తమ నిర్ణయాన్ని ఆపగలవా ? అని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు.
రాజధానిలో అవినీతి సొమ్మును కక్కిస్తాం..
చంద్రబాబు హయంలో రాజధాని పేరిట కొందరు బడా నేతలు రియల్ఎస్టేట్ వ్యాపారం చేసి రూ.కోట్లు దోచుకున్నారని.. ఆ దోపిడీ సొమ్ము ఎక్కడ చేజారిపోతుందనే భయంతోనే టీడీపీ నేతలు ఇలా గోల చేస్తున్నారని కొడాలి నాని ఎద్దేవ చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై కేబినెట్ సబ్ కమిటీ విచారిస్తోందని...దీనిపై పూర్తి స్థాయి నివేదిక అందాక అక్రమార్కులపై చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రాజధాని ప్రాంంతంలో ప్రభుత్వ భూములు దోచుకున్న దొంగలు ఎవరైనా సరే జైలుకు వెళ్లక తప్పదని.. అవినీతి సొమ్మను నిర్థాక్షణ్యంగా బయట కక్కిస్తామని మంత్రి నాని హెచ్చరించారు.