ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. విశాఖ పర్యటనలో ఉన్న కన్నా గురువారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ మ్యానిఫెస్టోలోని హామీల్లో ఏదీ చంద్రబాబు నెరవేర్చలేదని..అలాంటి ఏమైన ఉంటే చెప్పాలని సవాల్ విసిరారు. ఇక చంద్రబాబు వద్ద ప్రజలను మభ్య పెట్టేందుకు హామీలేవీ లేవని కన్నా విమర్శించారు.
పోలవరం అక్రమాల సాక్ష్యాలున్నాయ్
పోలవరం పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని తమకు సాక్ష్యాలతో సహా తెలిసిందని కన్నా వ్యాఖ్యానించారు. కడపలో స్టీల్ ప్లాంట్, దుగ్గరాజపట్నం పోర్టు రావడం చంద్రబాబుకు ఇష్టం లేదన్న కన్నా.. ఆయనే ఒప్పుకుంటే ఈ పాటికి ఎప్పుడో వచ్చి ఉండేదన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని అన్నారు. చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని విమర్శించారు.
కేంద్రంపై దుష్ప్రచారం మానుకో బాబు
రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా కేంద్రం నిధులను ఇస్తున్నప్పటికీ అవన్నీ రాష్ట్ర నిధులని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సహాయం చేసిన చేతులను నరకడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని విమర్శించారు. అన్ని వర్గాలనూ మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు కేంద్రాన్ని నిందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని కన్నాలక్ష్మీనారాయణ విమర్శించారు.