తెలుగు ఎంపీల నినాదాలతో దద్దరిల్లిన పార్లమెంట్ ఉభయ సభలు

Last Updated : Mar 19, 2018, 02:22 PM IST
తెలుగు ఎంపీల నినాదాలతో దద్దరిల్లిన పార్లమెంట్ ఉభయ సభలు

తెలుగు ఎంపీల నినాదాలతో పార్లమెంట్ ఉభయ సభలు మార్మోగాయి. ఉదయం లోక్ సభ ప్రారంభం కాగానే విభజన హామీలు, ప్రత్యేక హోదాపై చర్చకు పట్టుబడుతూ టీడీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ఇదే సమయంలో రిజర్వేషన్ల అంశంపై టీఆర్ఎస్ సభ్యులు కూడా ఆందోళనకు దిగడంతో స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టకుండానే సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఇటు రాజ్యసభలో కూడా ఇదే గందరగోళ పరిస్థితి. సభ ప్రారంభంకాగానే తెలుగు ఎంపీలు ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేపట్టారు. ఛైర్మన్ వెంకయ్యనాయడు సభ్యులను ఎంతగా వారించిన సభ్యులు వినకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు. 

ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలుపై కేంద్రం పూర్తిగా విఫలమైందని పేర్కొంటూ ఏపీ ప్రధాన రాజకీయ పక్షాలు టీడీపీ, వైసీపీలు మోడీ సర్కార్ పై అవిశ్వాసం నోటీసులు జారీ చేసింది. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన నోటీసులను లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్ సభ ముందుంచే అవకాశం ఉంది. సభ సజావుగా ఉంటే స్పీకర్‌ వాటికి మద్దతిచ్చే వారిని లేచి నిల్చోమని సూచిస్తారు. మొత్తం లోక్‌సభ సభ్యుల్లో 10 శాతం మంది మద్దతిస్తున్నట్లు స్పీకర్‌ నిర్ణయించుకుంటే అవిశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు ప్రకటించి చర్చ షెడ్యూల్‌ను నిర్ణయిస్తారు. ఒకవేళ సభ సజావుగా జరగకపోతే అవిశ్వాస తీర్మాన నోటీసులను తిరస్కరించి, సభను వాయిదా వేస్తారు.  ప్రభుత్వ వ్యవహారాలేమీ లేకుంటే నిరవధిక వాయిదా వేసే అవకాశం ఉంది.

Trending News