అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు ( BCG) సమర్పించిన నివేదికపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ‍్యక్షుడు చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. బోస్టన్ కమిటీకి తలాతోక ఏమైనా ఉందా.. కమిటీ ఎప్పుడు వేశారో కూడా స్పష్టత లేదంటూ చంద్రబాబు మండిపడ్డారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధిని కోరి 29వేల మంది రైతులు భూములు ఇచ్చారని.. నేడు వారు మనోవేదనతో ఉన్నారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా నాటకాలు ఆపాలంటూ ధ్వజమెత్తారు.
మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. క్లయింట్ల వద్ద డబ్బులు తీసుకుని రిపోర్టులిచ్చే సంస్థ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు ( BCG ) అని వ్యాఖ్యానించారు. అలాంటి కమిటీ ఇచ్చే నివేదికను నమ్మాల్సిన అవసరం ఉందా అని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డికి బోస్టన్ సంస్థతో సత్సంబంధాలున్నాయని ఆరోపించారు. బీసీజీ నివేదిక ఓ బూటకమని, అలాంటి సంస్థను నివేదిక ఇవ్వాలని కోరే హక్కు మీకు ఎవరిచ్చారంటూ చంద్రబాబు ప్రశ్నించారు. విశ్వసనీయత లేని నివేదికలతో ప్రజలను మోసం చేయవద్దని వైఎస్ జగన్ సర్కార్‌కు ఆయన హితవు పలికారు.
వైఎస్ జగన్ సర్కార్ చేతకానితనం కారణంగా రైతులు చనిపోతున్నారని చెప్పారు. రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు. శివరామకృష్ణ కమిటీ నివేదిక మేరకే రాజధాని ఏర్పాటు చేశామన్నారు. గతంలో సైబరాబాద్, 9 మున్సిపాలిటీలు కలపి హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ధి చేసిన విషయాన్ని ప్రస్తావించారు. భూములు అవసరమన్న శివరామకృష్ణ కమిటీ సలహా మేరకే 33వేల ఎకరాల భూమిని సమీకరించినట్లు వెల్లడించారు. రాజధాని ఏర్పాటు కోసం నారాయణ కమిటీ వేయలేదని, శివరామకృష్ణ కమిటీ నివేదిక ఆధారంగా రాజధానిని అభివృద్ధి చేసిన కమిటీ అని తెలిపారు. విషయం తెలియకుండా ఆరోపణలు చేయడం తగదని వైఎస్సార్‌సీపీ నేతలకు మాజీ సీఎం చంద్రబాబు సూచించారు.
రాజధాని విషయంలో బీసీజీ నివేదికపై చంద్రబాబు ఆగ్రహం